వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం, ఉపఎన్నికలు లేనట్టే!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలు ఎట్టకేలకు ఆమోదం పొందాయి. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఐదుగురు వైసీపీ ఎంపీలు తమ పదవులకు చేసిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఈ సాయంత్రం ఆమోదించారు. వైసీపీ ఎంపీలు వరప్రసాద్ రావు, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలు ఈ ఏడాది ఏప్రిల్-6న లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు రాజీనామా లేఖలు సమర్పించిన విషయం తెలిసిందే.

కొన్ని రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన వైసీపీ ఎంపీలు తమ రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. అయితే, రాజీనామాలపై పునరాలోచించుకోవాలని, నిర్ణయం మారకపోతే ఆమోదిస్తానని ఆమె అప్పట్లో అన్నారు. ఈనెల 7న మరోసారి రావాలని చెప్పారు. అయితే, ఆ తర్వాత 10 రోజుల పాటు మూడు దేశాల పర్యటనకు వెళ్లి ఈ నెల 19న భారత్‌కు చేరుకున్న స్పీకర్‌ ఎంపీల రాజీనామాల అంశంపై అధికారులతో సంప్రదించారు. అన్ని సంప్రదింపులు పూర్తయ్యాక వారి రాజీనామాలకు ఆమోద ముద్ర వేశారు. ఐదుగురు వైసీపీ ఎంపీల రాజీనామాలు ఈ రోజు నుంచి అమలులోకి రానున్నాయని లోక్‌సభ సభాపతి కార్యాలయం బులిటెన్‌ విడుదల చేసింది.

Related News