అమెరికాపై రష్యా సైబర్ దాడి, తిప్పికొట్టిన మైక్రోసాఫ్ట్

ఇంటర్నేషనల్‌గా ఇదొక బ్రేకింగ్. అమెరికా ప్రభుత్వ సంస్థలపై సైబర్ దాడులు చేసేందుకు రష్యా హ్యాకర్స్ చేసిన
ప్రయత్నాలను తిప్పికొట్టింది మైక్రోసాఫ్ట్. రష్యాకు చెందిన హ్యాకర్లు.. ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్‌స్టిట్యూట్, హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ లాంటి ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారం దొంగిలించేందుకు ప్రయత్నించాయి. రెండు డొమైన్లలో ఒకటి సెనేట్ ఆఫీసులు, సేవలకు చెందినది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఆన్‌లైన్ సర్వీస్ పేరుతో హ్యాకర్లు ఒక నకిలీ డొమైన్‌ని క్రియేట్ చేసి దాని ద్వారా సమాచారం దొంగిలించడానికి ప్లాన్ చేశారు.

హ్యాకర్లు ఉపయోగించిన 6 నెట్ డొమైన్లను కంట్రోల్ చేశామని, ఈ దాడుల వెనుక ‘ఫ్యాన్సీ బేర్’ అనే హ్యాకింగ్ గ్రూప్ ప్రమేయమున్నట్లు తెలిపింది మైక్రోసాఫ్ట్. నకిలీ డొమైన్లతో కొందర్ని ఆకర్షించి, వాళ్ల లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను తెలుసుకునేందుకు హ్యాకర్లు ప్రయత్నించినట్టు వివరించింది. రెండేళ్లలో ఫ్యాన్సీ బేర్స్‌కు చెందిన 84 ప్రమాదకరమైన డొమైన్లను నిర్వీర్యం చేయడానికి 12 సార్లు ప్రయత్నించినట్లు మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్‌స్మిత్ అన్నారు. అమెరికా సంస్థలపై సైబర్ దాడి ఆరోపణలను ఖండించింది రష్యా.

Related News