W/o బీజేపీ.. C/o జనసేన

ఏపీలో బీజేపీకి నూకలు చెల్లిపోయాయన్న క్లారిటీ.. ఆ పార్టీ నేతల్ని బైటికి చూసేలా చేస్తోంది. దీనికి తోడు.. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు మార్చడం కూడా కొందరు నేతలకు పొగబెట్టినట్లయింది. రానున్న రోజుల్లో కొందరు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారుతారన్న వాసనొచ్చింది. ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా.. ఒక ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య ఆకుల లక్ష్మీపద్మావతి.. పవన్ కళ్యాణ్ కి సంపూర్ణ మద్దతు పలికారు. ఉద్దానం బాధితుల కోసం పవన్ చేసిన దీక్షకు సంఘీభావంగా ఆమె కూడా ఒకరోజు దీక్ష చేశారు. తాను ఎప్పట్నుంచో పవన్ అభిమానినని, ఆయన ఆశయాలు-ఆవేశాలు తనకు నచ్చుతాయని చెబుతోంది. ఉద్దానం కిడ్నీ బాధితుల పక్షాన పవన్ పోరాడుతున్న తీరు చూసి స్ఫూర్తి పొందానని చెప్పింది. భర్త బీజేపీ ఎమ్మెల్యే అయినప్పటికీ.. తనకు ఎటువంటి అడ్డూ చెప్పలేదంటోంది ఆకుల లక్ష్మీ పద్మావతి. రేపటిరోజున అవకాశమొస్తే.. భార్యాభర్తలిద్దరూ జనసేనలోకి జంప్ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజమండ్రి జనాభా.

Related News