నాగవైష్ణవి హత్య కేసు.. సంచలన తీర్పు ఇచ్చిన న్యాయస్థానం

సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి హత్యకేసులో కీలక తీర్పు వెల్లడించింది న్యాయస్థానం. ఈ కేసులో ముగ్గురు నిందితులైన మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీశ్‌, వెంకటరావుగౌడ్‌లకు జీవిత ఖైదు విధించింది. ఎనిమిదిన్నరేళ్ల కిందట విజయవాడలో జరిగిన ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. హత్య, అపహరణ నేరాలు రుజువు కావడంతో నేరస్తులకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు తెలిపారు మహిళా సెషన్స్  కోర్టు న్యాయమూర్తి.

గతంలోకి వెళ్తే..

విజయవాడకు చెందిన పలగాని ప్రభాకరరావు బిజినెస్‌మేన్, ఆపై బీసీ నాయకుడు కూడా! ఆయనకు నలుగురు బ్రదర్స్, ముగ్గురు సిస్టర్స్. సోదరి వెంకటేశ్వరమ్మకు వివాహం జరిగాక కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు. దీంతో ఆమె తన కొడుకు, కూతురులను తీసుకుని సోదరుల వద్దకి వచ్చింది. దీంతో సోదరి కూతుర్ని ప్రభాకరరావు మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆరుగురు మగ పిల్లలు పుట్టి మరణించారు. పిల్లలంటే అతిగా ఇష్టపడే ప్రభాకరరావు..చివరకు సమీప బంధువైన నిజామాబాద్‌కు చెందిన నర్మదాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీళ్లకి ముగ్గురు పిల్లలు. ఇద్దరు మగపిల్లలు, ఒక పాప నాగవైష్ణవి.

2010 జనవరి 30న నాగవైష్ణవి తన అన్నయ్యతో కలిసి కారులో స్కూల్‌కి వెళ్తుండగా చిన్నారిని దుండగులు అపహరించారు. అదేరోజు రాత్రి కారు డ్రైవరు లక్ష్మణరావును దారుణంగా చంపేశారు నిందితులు. కారులో విజయవాడ నుంచి గుంటూరు వైపు నాగవైష్ణవిని తీసుకెళ్తూ గొంతునులిమి హతమార్చారు. ఆ తర్వాత గుంటూరు ఆటోనగర్‌లోని ఓ బ్లాస్ట్‌ ఫర్నేస్‌లో నాగవైష్ణవి శవాన్ని పడేశారు. ఎముకలు కూడా కరిగిపోయేలా మండించి బూడిద చేశారు. అపహరించిన చిన్నారిని హతమార్చారనే సంగతి బయటకురావడంతో నాగవైష్ణవి తండ్రి ప్రభాకర్‌ గుండెపోటుతో మరణించారు. దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. బ్లాస్ట్ ‌ఫర్నేస్‌ నుంచి నాగవైష్ణవి చెవి పోగులను సేకరించిన పోలీసులు.. నివేదిక కోసం ల్యాబ్‌కి పంపారు. ఐతే, చెవి పోగుకు వజ్రం ఉండడంతో ఈ హత్య కేసుకు ఇదే కీలకంగా మారింది. ఈ కేసులో ప్రభాకరరావు బావమరిది పంది వెంకట్రావు గౌడ్‌, మోర్ల శ్రీనివాసరావు, యంపరాలు జగదీశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తిచేసి నిందితులకు శిక్షపడేలా చూడాలని ప్రభాకర్‌ సోదరుడు సుధాకర్‌ న్యాయం కోసం పోరాడుతూ వచ్చారు. నాగవైష్ణవి బాబాయి సుధాకర్‌ కూడా గతేడాది అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెల్సిందే!

READ ALSO

Related News