విజయ్, మురుగదాస్.. క్షమాపణ చెబుతారా?

ఒకే ఒక్క వివాదాస్పద డైలాగ్‌తో దేశవ్యాప్త సంచలనం సృష్టించడమే కాక.. కేంద్ర ప్రభుత్వాన్ని సైతం వణికించింది తమిళ్ ‘మెర్సల్’ మూవీ. అప్పటికే జనం నెత్తిన పడ్డ జీఎస్టీ బండ.. ఆ సినిమా ద్వారా మరింత లొల్లి క్రియేట్ చేసింది. సినిమా మీద నిషేధం పెట్టాలంటూ బీజేపీ శ్రేణులు దేశమంతా ‘అల్లరి’ చేసినప్పటికీ.. ఎలాగోలా ‘గండం’ నుంచి గట్టెక్కిందా మూవీ! అందులో లీడ్ రోల్ చేసిన యువ హీరో విజయ్‌కి నేషనల్ రికగ్నిషన్ వచ్చేసింది. ఇప్పుడు అదే విజయ్ కెరీర్‌లో వస్తున్న 62వ మూవీ మాతో విచిత్ర వివాదాన్ని మోసుకొచ్చింది.

మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ‘సర్కార్’ అనే ఈ మూవీకి సంబంధించి ఫస్ట్‌లుక్ రిలీజయింది. విజయ్ పుట్టినరోజు కానుకగా వచ్చిన ఈ ఫస్ట్ పిక్ అతడి అభిమానుల్ని అలరించే స్థాయిలోనే వుంది. విజయ్ స్టైలిష్ లుక్‌తో కనిపిస్తున్న ఈ పోస్టర్ తమిళనాట రాజకీయ, సామాజిక కలకలానికి దారితీస్తోంది. ఇందులో విజయ్ సిగరెట్ కాలుస్తున్నట్లుగా ఇస్తున్న పోజ్ మీద ‘వ్యతిరేకులు’ విమర్శలు ఎక్కుపెట్టేశారు. ఇబ్బడిముబ్బడిగా సోషల్ మెసేజెస్ ఇస్తూ.. యూత్‌కి ఐకాన్‌గా చెప్పుకునే విజయ్.. ఇలా స్మోకింగ్‌ని ఎంకరేజ్ చేస్తున్నారా అంటూ పీఎంకే పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది. ‘ఈ సిగ్గుచేటైన విషయం మీద విజయ్ వెంటనే స్పందించాలి’ అంటూ ఆ పార్టీ అధినేత, కేంద్ర మాజీ ఆరోగ్యమంత్రి అన్బుమణి రాందాస్ హెచ్చరిస్తున్నారు. పైగా.. సినిమాల్లో సిగరెట్ తాగుతూ కనిపించబోనంటూ ఇంతకుముందో సందర్భంలో విజయ్ చేసిన ప్రామిస్‌ని కూడా గుర్తు చేస్తున్నారు.

ఆమధ్య రాజకీయాల్లోకి వస్తున్నానని కూడా స్టేట్మెంట్ ఇచ్చిన విజయ్.. తన ఇమేజ్ బ్యాడ్ కాకూడదంటే.. వెంటనే ఏదో ఒకటి చెయ్యాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తున్న పోస్టర్‌ని వెనక్కు తీసుకోవడం కుదరదు కనుక.. బేషరతుగా క్షమాపణ చెప్పవచ్చని కోలీవుడ్ అంటోంది. మంచి సామాజిక సందేశాలతో సినిమాలు తీసే మురుగదాస్ కూడా ఈ విషయంలో ఎలా తప్పులో కాలేశారన్నది మరో అంశం!

Related News