నా కొడుకు ఆచూకీ తెలిసింది

హైదరాబాద్‌కు చెందిన 36 ఏళ్ళ టెక్కీ రాఘవేంద్రరావు ఆచూకీ తెలిసింది. అమెరికా… కాలిఫోర్నియాలోని మైక్రోసాఫ్ట్ కంపెనీలో పని చేస్తున్న రాఘవేంద్రరావు గత ఏడాది అక్టోబరు నుంచి తన కుటుంబంతో టచ్‌లో లేకపోవడంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన తండ్రి పి.బంగారం తన కుమారుడి ఆచూకీ తెలియజేయాలంటూ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు, తెలంగాణా మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాఘవేంద్రరావు ఫోన్ స్విచాఫ్‌లో ఉంటూవచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే శనివారం తన కుమారుడు తనను కాంటాక్ట్ చేశాడని బంగారం.. ఏఎన్ఐకి తెలిపారు. తనకొడుకుతో సహజీవనం చేస్తున్న అమ్మాయితో తలెత్తిన సమస్యలే ఇందుకు కారణమైనట్టు తెలిసిందన్నారు. ఏమైనా ..బంగారం.. సుష్మా స్వరాజ్‌కు, కేటీఆర్‌‌కు కృతఙ్ఞతలు తెలిపారు. కాగా… రాఘవేంద్రరావు వీసా కాల పరిమితి ముగిసిందని, దానిని పునరుద్ధరించి తన కొడుకు తమ కుటుంబంతో కలిసేలా చూడాలని ఆయన సుష్మా స్వరాజ్, అమెరికాలోని భారత ఎంబసీలను అభ్యర్థిస్తున్నారు. సుమారు ఎనిమిది నెలల తరువాత తమ కుమారుడు వాట్సాప్ వీడియో కాల్ చేయడంతో బంగారం, ఆయన భార్య పుష్పలత ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. ఈ కాల్ ద్వారా రాఘవేంద్రరావు తన ఆవేదనను తన తలిదండ్రులకు చెప్పుకున్నాడు. తన ఆఫీసులోనే పని చేసే ఓ యువతిని ప్రేమించానని, ఇద్దరం కలిసి సహజీవనం చేశామని, ఇద్దరు పిల్లలు కూడా పుట్టారని, అయితే విభేదాల కారణంగా ఆ అమ్మాయి తనపై కేసు పెట్టిందని తెలిపాడు. దీంతో కాలిఫోర్నియా పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారని వాపోయినట్టు తెలిసింది. రెండు నెలలపాటు జైల్లో ఉండి బెయిలుపై బయటకు వచ్చానని అన్నాడు. ఈ కారణాల పర్యవసానంగా తనను జాబ్ నుంచి తొలగించారని, తన వీసా కూడా ఆ అమ్మాయి వద్దే ఉండడంతో ఇండియాకు రాలేకపోతున్నానని రాఘవేంద్రరావు  పేర్కొన్నాడు.

Related News