రాజమౌళితో కేంద్రమంత్రి భేటీ, బీజేపీకి జక్కన్న సేవలు!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌.. బీజేపీకి మద్దతు ఇస్తున్నారా? ఇప్పుడు ఇదే ప్రశ్న తెలుగు ప్రజలను వెంటాడుతోంది. మోదీ ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్ల సందర్భంగా చేపట్టిన ‘సంపర్క్‌ ఫర్ సమర్థన్‌’ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల ప్రముఖులను బీజేపీ నేతలు కలుస్తున్నారు. దేశవ్యాప్తంగా 4000 మంది బీజేపీ నేతలు.. వివిధ రంగాల్లో టాప్ పొజిషనల్‌లోవున్న దాదాపు లక్ష మందిని కలిసి పార్టీ చేసిన మంచి పనుల్ని వివరించి వారి మద్దతు కోరడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఇందులోభాగంగానే గురువారం కేంద్రమంత్రి హన్స్‌రాజ్‌ అహిర్‌ నాయకత్వంలోని ఓ బీజేపీ బృందం.. రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌లతో భేటీ అయ్యింది.

ఈ సమావేశంలో వివిధ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఆర్ఎస్ఎస్‌పై తీయనున్న చిత్రానికి విజయేంద్రప్రసాద్ సేవలను వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు ఇన్‌సైడ్ సమాచారం.

ఉత్తరాదిలో సినీ ప్రముఖులను స్వయంగా వెళ్లి కలిసిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. స్టార్ డైరెక్టర్ రాజమౌళి విషయంలో కేంద్రమంత్రిని పంపడం ఎంతవరకు సమంజసమని జక్కన్న హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. దీనిపై సోషల్‌మీడియాలో చర్చ కూడా మొదలైంది. ఇంతకీ రాజమౌళి మద్దతు ఇచ్చారా? లేదా? అన్నది కొద్దిరోజుల్లో తేలిపోనుంది.

Related News