మళ్ళీ గెలవాలా.. వద్దా..?

దేశవ్యాప్తంగా పొలిటికల్ ట్రెండ్ యూటర్న్ తీసుకుంది.. మోదీకి ఎదురుగాలి వీస్తోంది.. రాహుల్ గాంధీతో పాటు మరికొన్ని శాల్తీలు ఢిల్లీకి దగ్గరవుతున్నారు. ఈ సీక్వెన్స్ మొత్తాన్ని ఓరకంట గమనిస్తున్న బీజేపీ చీఫ్ అమిత్ షా.. ఒకటికి నాలుగు మెట్లు కిందికి దిగొచ్చి.. ఓట్ల కోసం బిక్షాటన షురూ చేసుకున్నారు. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అంటే.. కాంగ్రెస్ పార్టీని నిర్మూలించమని కాదు.. కాంగ్రెస్ సంస్కృతికి మంగళం పాడమని అర్థం’ అంటూ కొత్త భాష్యం చెప్పిన అమిత్ షా.. బీజేపీ జోరు తగ్గిందన్న సంకేతాల్ని అడ్డంగా ఒప్పేసుకున్నారు. అటు.. మోదీ సైతం ప్రభుత్వం వైపు నుంచి డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. పాలక కూటమి ఎన్డీఏ కొద్దికొద్దిగా బక్కచిక్కడం, ఉపఎన్నికల్లో ఫలితం తిరగబడ్డం, లోక్‌సభలో బీజేపీ సొంత బలం తగ్గిపోవడం లాంటి పరిణామాలు మోదీని అప్రమత్తం చేసేశాయి. ఈ క్రమంలోనే.. ఈ సాయంత్రం మంత్రివర్గ కీలక భేటీ ఏర్పాటు చేసుకున్నారు. క్యాబినెట్‌లోని మొత్తం 73 మంది మంత్రులూ హాజరు కావాలంటూ హుకుం జారీ చేశారు కూడా. ఒక్కో మంత్రీ తమతమ శాఖలకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకురావాలని, విజయాలను, వైఫల్యాలను ఏకరువు పెట్టాలని ఆజ్ఞాపించారు ప్రధాని మోదీ. 2019 ఎన్నికల్లో మెరుగైన ఫలితం దక్కాలంటే ఏమేం చేయాలన్న సూచనలు, సలహాలు తీసుకోవడంతో పాటు.. పక్కా స్కెచ్ కూడా అక్కడే సిద్ధం చేస్తారని తెలుస్తోంది.

Related News