నవాబుకు దక్కని లక్ వీళ్ళకు దక్కింది

హైదరాబాద్ పాత బస్తీ పురానా హవేలీలోని నిజాం మ్యూజియంలో వారం  రోజుల క్రితం జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు.ఈ ఘరానా దొంగతనానికి పాల్పడి ముంబై పారిపోయిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
మ్యూజియం‌లోని నాలుగు కేజీల బరువైన..కోట్లాది రూపాయల విలువగల టిఫిన్ బాక్స్, ఇంకా.. టీ కప్పు, సాసర్, గోల్డ్ స్పూన్ చోరీకి గురయ్యాయి. ఈ నెల‌2‌న ఈ దొంగలు మ్యూజియం వెంటిలేటర్ తొలగించి నేర్పుగా మ్యూజియంలోకి ప్రవేశించారని, ఇనుప గ్రిల్ తొలగించి లోపలి వస్తువులను దొంగిలించుకుపోయారని పోలీసులు తెలిపారు.
చోరీ చేసిన సొత్తుతో ముంబై చెక్కేసిన వీరు అక్కడి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జల్సా చేశారని,  అత్యంత విలువైన టిఫిన్ బాక్స్‌లో రోజూ ఆహారం తినేవారని తెలిసిందని వారు చెప్పారు. ఈ ఇద్దరిలో ఒకడు సుమారు నెల రోజులుగా ఓ టూరిస్టు‌లా మ్యూజియంకు వచ్చి రెక్కీ వంటిది నిర్వహించాడన్నారు.
జహీరాబాద్‌లో వీరు వదిలిన బైక్ ను స్వాధీనం చేసుకున్నామని.. ఈ కేసులో సీసీటీవీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా చేసిన పరిశీలన ఎంతగానో తోడ్పడిందని ఖాకీలు తెలిపారు.
ఈ వస్తువులను అమ్మితే కోటి రూపాయలైనా వస్తాయని నమ్మారని, అయితే అత్యంత అమూల్యమైన ఇవి ఎన్నో కోట్ల రూపాయల విలువైనవని వీరికి తెలియనట్టు ఉందని వారు పేర్కొన్నారు. వీరిని మీడియాముందు పోలీసులు హాజరు పరిచారు.
నిందితుల్లో ఒకడైన పాషాపై సుమారు 25 చోరీ కేసులున్నాయని, మోబిన్ అనే మరో నిందితుడు కొంతకాలం గల్ఫ్ లో పనిచేసి ఓ కేసులో కొన్ని రోజులు జైలుశిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు. చిన్ననాటి నుంచి స్నేహితులు, దూరపు బంధువులైన ఈ ఇద్దరూ దాదాపు 40 రోజుల ముందే రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ తో ఈ చోరీ చేశారని వారు చెప్పారు.

READ ALSO

Related News