తెలంగాణాలో మహాకూటమి.. 4 పార్టీలు, ఒకటే మేనిఫెస్టో!

తెలంగాణాలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీటీడీపీ, టీ.కాంగ్రెస్ మధ్య పొత్తులపై ప్రాథమిక సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. మంగళవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ భేటీ అయ్యారు. వీరితోపాటు సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి కూడా చర్చల్లో పాల్గొన్నారు.  ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో టీడీపీకి మంచి పట్టు ఉన్న దృష్ట్యా తమకు 10 స్థానాలు కేటాయించాలని తెలంగాణా తెలుగుదేశం పార్టీ కోరుతోందని తెలుస్తోంది.

 

2014 ఎన్నికల్లో కుకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్, సనత్ నగర్, కుత్బుల్లా పూర్, మహేశ్వరం, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. అయితే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మినహా మిగిలినవారు ఆ తరువాత తెరాసలో చేరారు. తాజాగా తమకు కుకట్ పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీ హిల్స్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, ఉప్పల్, ఖైరతాబాద్, అంబర్ పేట నియోజకవర్గాలు కేటాయించాలని టీపీసీసీని టీటీడీపీ కోరుతోందని, దీంతో ఈ నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతల్లో ఆందోళన మొదలైందని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఏమైనా..పొత్తులపై ప్రస్తుతం జరుగుతున్నవి ప్రాథమిక చర్చలే గనుక.. ఈ సీట్ల పంపకం విషయం ఖరారు కావడానికి మరికొన్ని రోజులు పట్టే సూచనలున్నాయి. ఇదిలా ఉంటే.. పార్క్ హయత్ లో జరిగిన భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందరం కలిసి ఒకటే మేనిఫెస్టో రూపొందించుకోవాలని, విభజన హామీల అమలు కోసం కలిసి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు.

READ ALSO

Related News