అదంతా హంబక్ : హరీశ్ రావు

రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుందేమోనన్న వ్యాఖ్యల వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌ రావు వివరణ ఇచ్చారు. ప్రజాభిమానానికి చలించి భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు మాత్రమేనన్నారు. జోరువానలో గ్రామస్థులు అపూర్వ స్వాగతం పలకడంతో భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. ‘గ్రామస్థుల అభిమానం చూసి.. జీవితంలో ఇంతకంటే మరేం కావాలి అనిపించింది. భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు తప్ప మరేం కాదు. తెరాసలో నాకు ప్రాధాన్యం లేదనేది గిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారమే’’ అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.

 

ఇంతకీ.. హరీశ్‌రావు ఇబ్రహీంపూర్‌లో ఏమన్నారంటే..

ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీశ్‌రావు శుక్రవారం సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తే ఓట్ల కోసం నేతలు ప్రజల చుట్టూ తిరుగుతారు.. కానీ, సిద్దిపేట నియోజకవర్గంలో మీకే ఓటేస్తామంటూ ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘సిద్దిపేట చరిత్రను తిరగరాస్తోంది.. ఇదో అద్భుతం. మంగళహారతులు, బతుకమ్మ, బోనాలతో నాకు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు.. నిజంగా నా జన్మ ధన్యమైంది. ఈ జన్మకు ఇది చాలనిపిస్తోంది’ అని చెప్పారు. ‘‘పదవిలో, రాజకీయాల్లో ఉన్నా, లేకపోయినా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా. ఊపిరి ఉన్నంత కాలం మీ ఆదరాభిమానాలు మర్చిపోలేను. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రేమానురాగాలు కురిపిస్తున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి?.. మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ ప్రేమాభిమానాలున్నప్పుడే రాజకీయాల నుంచి విరమించుకుంటే బాగుంటుందేమోనని ఒక్కోసారి అనిపిస్తుంది’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం కావడంతో హరీశ్‌రావు వివరణ ఇచ్చారు.

Related News