దానం- గోషామహల్, మల్లారెడ్డి – మేడ్చల్!

అసంతృప్తులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టీఆర్ఎస్‌కు మిగిలిన 14 స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం కాసింత కష్టంగానే మారింది. పెండింగ్‌లోవున్న అసెంబ్లీ సీట్ల కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు టీఆర్ఎస్ ముఖ్యనేతలు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత నేతల్లో వ్యతిరేకత రాకుండా వుండేందుకు ముందుగానే కేటీఆర్, ఆశావహులతో చర్చలు జరుపుతున్నారు. ఇవన్నీ కొలిక్కి వచ్చిన తర్వాత బుధ లేదా గురువారాల్లో మరో జాబితాను ప్రకటించే ఛాన్స్ వుంది.

పెండింగ్‌లోవున్న సీట్లలో హైదరాబాద్‌లోనే ఏడు వున్నాయి. బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్‌ నుంచి దానం నాగేందర్ పేరు ఖరారైనట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఇండిపెండింట్ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచిన నందకుమార్ వ్యాస్, టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన ప్రేమకుమార్ ధూత్ కూడా టికెట్ కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలిన ఇద్దరు నేతలకు నచ్చజెప్పి.. దానం పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇటు ఎంఐఎం నేతలు కూడా దానం వైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. మేడ్చల్‌ నుంచి మల్లారెడ్డి బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. తీవ్ర అసంతృప్తితోవున్న తాజా మాజీ ఎమ్మెల్యే.. కేటీఆర్‌ని కలిశారు. ఆయనతో మాట్లాడిన తర్వాత వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

Related News