పంజాబ్ ఘోరం వెనుక అసలేం జరిగింది?

పంజాబ్‌లో దసరా సంబరాలు పెను విషాదాన్ని మిగిల్చింది. అమృత్‌సర్‌ సమీపంలోని జోడా ఫాఠక్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో నిర్వహించిన రావణ దహనాన్ని చూసేందుకు వచ్చిన స్థానిక ప్రజలపైకి రైలు దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తొలుత 50 మంది చనిపోయినట్టు భావించినా, క్రమేపి మృతుల సంఖ్య 61కి చేరింది. మరో 72 మంది గాయపడ్డారు.

రైలు పట్టాల పక్కనేవున్న ఓ మైదానంలో రావణ దహన వేడుకలు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని దాదాపు 300 మంది వీక్షిస్తున్నారు. బాణసంచా పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. వేడుకను చూసేందుకు కొందరు పట్టాలపైకి వెళ్లారు. రావణ దహనాన్ని తమ సెల్‌ఫోన్లతో చిత్రీకరించే పనిలో నిమగ్నమయ్యారు.

ఆ సమయంలో రెండు వేరువేరు ట్రాక్‌ల మీద రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. దీంతో కంగారుపడిన జనం, తప్పించుకోవడానికి అవకాశం లేకపోయింది. బాణాసంచా పేలుళ్ల శబ్దం కారణంగా రైళ్ల రాకను గుర్తించలేకపోయినట్లు తెలుస్తోంది. ఈ అయోమయంలో జలంధర్‌ నుంచి అమృత్‌సర్‌ వైపు వేగంగా దూసుకెళుతున్న రైలు కిందపడి నలిగిపోయారు.

తెగిపడ్డ అవయవాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. మృతుల్లో అనేక మంది చిన్నారులున్నారు. ప్రమాదం జరిగిన కొన్నిగంటల వరకు మృతదేహాలు ఘటనా స్థలిలో పడివున్నాయి. ఈ వేడుకకు పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సిద్ధూ భార్య, స్థానిక ఎమ్మెల్యే నవజ్యోత్‌ కౌర్‌ సిద్ధూ గెస్ట్‌గా హాజరయ్యారు. ప్రమాదం విషయం తెలియగానే క్షతగాత్రులను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లారు.

ప్రమాదం జరగడానికి ముందే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడినవారికి రూ.50వేల పరిహారాన్ని ప్రకటించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. శనివారం ఇజ్రాయెల్‌ టూర్‌కి వెళ్లాల్సిన సీఎం అమరీందర్, ఘటన నేపథ్యంలో రద్దు చేసుకున్నారు.

 

Related News