”మేం నంద్యాలలో చేసిందే.. జగన్ రాజమండ్రిలో చేశారు..”

వెస్ట్ నుంచి ఈస్ట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చే సందర్భంలో.. రాజమండ్రి వంతెన మీద జరిగిన జగన్ ‘బలప్రదర్శన’ తాలూకు వేడి ఇంకా చల్లారలేదు. సంద్రాన్ని తలపించిన జన సందోహం వైసీపీ శ్రేణుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇటు తెలుగుదేశం నేతలైతే లోపల్లోపలే ఉడుకెత్తిపోతున్న పరిస్థితి. కాకపోతే.. ఇదంతా సమీకరిస్తే వచ్చిన జనమా లేక స్వచ్ఛందంగా తరలివచ్చిన జనమా అనేది ఎప్పుడూ వుండే ఒక హైపోథెటికల్ క్వశ్చన్. రెండు జిల్లాల్లో పార్టీ నేతలకు టార్గెట్ పెట్టి.. బలవంతంగా తోలితే వచ్చినవాళ్లే ఆరోజు రాజమండ్రి బ్రిడ్జిని నింపేశారని తెలుగుదేశం వాదిస్తోంది.

 

కాంగ్రెస్ పార్టీ వాదన అయితే మరింత లోతుగా వుంది. ”ఈవెంట్ మేనేజింగ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటే.. అరగంటలో ఆరేడు లక్షల మందిని కూడా సమీకరించవచ్చు. సినిమా షూటింగులకు, రాజకీయ సభలకు ఎప్పుడంటే అప్పుడు రావడానికి రెడీమేడ్ జనాభా బ్యాచ్ ఒకటి ఉంటుంది..” అంటూ ఒక నగ్నసత్యాన్ని విప్పిచెప్పారు సీమకు చెందిన ఒక సీనియర్ కాంగ్రెస్ నేత. ఒక టీవీ డిబేట్లో మాట్లాడుతూ ఆయన మరో సీక్రెట్‌ని కూడా సిగ్గుపడకుండా ఓపెన్ చేశారు. ”నంద్యాల ఉపఎన్నికలో ఆఖరి నిమిషంలో క్యాండిడేట్‌ని ఫిక్స్ చేసుకున్నాం. తెల్లారితే నామినేషన్ వేయాలి. అర్జెంటుగా జనం కావాలి. వెంటనే ఇద్దరు ఈవెంట్ మేనేజర్లకు ఫోన్లు చేశాం.. అనుకున్న పని అయిపోయింది.. కాకపోతే లక్షో రెండు లక్షలో డబ్బు ఖర్చయింది అంతే..” అన్నారు. ఇటువంటి ‘ఘనకార్యం’ అందరూ చేసేదే అయినా ఇంత నిజాయితీగా ఒప్పుకోవడం అనేది సదరు నాయకుడి గొప్పతనం. కానీ.. ‘అద్దె జనం’తో పనికానిచ్చుకునేంత దౌర్భాగ్యం వైసీపీ, టీడీపీ లాంటి ప్రధాన పార్టీలకు పడుతుందా అనేది సందేహాస్పదం!

Related News