తెలంగాణాలో ఆయనే ‘మా దేవుడు’.. ఎందుకంటే..!

తెరాస-బీజేపీ లోపాయకారి మైత్రి ఎంత మేరకు నిజమో తెలీకపోయినా.. సదరు ఊహకు బలాన్నిచ్చే వార్తలు మాత్రం వేగంగా పుట్టుకొస్తున్నాయి. తొలి జాబితాలో బీజీపీ సిట్టింగ్‌లున్న సీట్లను దాదాపుగా మినహాయించడం.. మోదీతో వరుస భేటీలు, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలతో మంతనాలు.. ఇవన్నీ గులాబీ-కమలం మిలాఖత్‌ని గట్టిపరుస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకే మా మద్దతు అంటూ అఖిల భారత హిందూ మహాసభ బహిరంగ ప్రకటన జారీ చేయడం మరో పొలిటికల్ సెన్సేషన్.

తెలంగాణలో యాగాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే కేసీఆర్‌కు కాకుండా మరెవ్వరికి మద్దతివ్వాలన్నది హిందూ మహాసభ సూటి ప్రశ్న. తెలంగాణాలో ఎన్నో దేవాలయాలు బతికున్నాయంటే దానికి కేసీఆరే కారణమని, హిందూ పండుగల్ని రాష్ట్ర పండుగలుగా ప్రకటించడంలో ఆయనే ముందున్నారని ‘సభ’ అంటోంది. సనాతన ధర్మ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్ వెనుక నిలబడడానికి తమకెంత మాత్రం జంకు లేదంటున్నారు హిందూ మహాసభ జాతీయ అధ్యక్షులు శ్రీ రామానుజ వ్రతధర జీయరుస్వామి.

తెలంగాణ నియోజకవర్గాల్లో హిందువుల ఓట్లను సమీకరించే యత్నాల్లో ఇదీ ఒకటని.. బ్రాహ్మణ వర్గాలు సెంటిమెంటల్ టర్న్ తీసుకోడానికి గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోందని విశ్లేషణలొస్తున్నాయి. హిందూ మహాసభ.. ఒక హిందుత్వ అతివాద సంస్థ. దీని వెనుక బీజేపీ ప్రత్యక్ష ప్రమేయం వున్నా లేకపోయినా.. హిందూ ఓటర్ల మనోభావాల్ని ప్రభావితం చేసే సత్తా అయితే దానికుంది. తమిళనాడులో సైతం పార్టీ పెట్టిన కొత్తరోజుల్లో పిలవక ముందే రజనీకాంత్‌ని కలిసి మద్దతు ప్రకటించింది హిందూ మహాసభ. అక్కడ కూడా బీజేపీతో రజనీ దోస్తీ అంటూ పుకార్లు పుట్టేశాయి.

హిందూ మహాసభ.. దక్షిణాది రాష్ట్రాల్లో క్రియాశీలకంగా లేకపోయినప్పటికీ.. ఉత్తరాదిన మాత్రం ఊపు మీదుంది. యూపీలో అఖిల భారత హిందూ మహాసభ చీఫ్‌కి జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది అక్కడి సర్కార్. కొన్ని విచారణ కమిటీల్లో దీనికి సభ్యత్వం కూడా వుంది. అటు.. గాంధీ హంతకుడు నాధూరాం గాడ్సే పేరు మీద వెబ్‌సైట్ నిర్వహిస్తోంది. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం వాడిన కారును తగలబెట్టి ఫరీదాబాద్‌లో సంచలనం సృష్టించింది కూడా ఈ హిందూ మహాసభే. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఉనికిని పెంచుకునేందుకు ఇలా ‘పొలిటికల్ టచ్’ ఇవ్వడం వాళ్ళ స్ట్రాటజీ. గులాబీ శిబిరానికి కూడా దీంతో ఎంతోకొంత లబ్ది కలిగినా కలగొచ్చు.

Related News