గుహనుంచి బయటకొచ్చిన నలుగురు

గుహలో థాయ్ బాలలు చిక్కుకున్న వ్యవహారం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ బాలికలు బయటకు రావాలంటే మూడు నాలుగు నెలలు పట్టొచ్చంటూ పేర్కొనడంతో ఈ అంశంపై యావత్ ప్రపంచం దృష్టి సారించింది. అయితే, ఈ బాలల వెలికితీత కార్యక్రమం ప్రయోగాత్మకంగా ఆదివారం ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సహాయకచర్యల్లో నలుగురు బాలలను క్షేమంగా బయటకు తీసుకురాగలిగారు. మిగతావారిని ఇవాళ తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న చియంగ్‌రాయ్‌ ప్రావిన్స్‌ గవర్నరు నరోంగ్‌సక్‌ ఒసొట్టానకోర్న్‌ ఈ విషయం తెలియచేశారు.

ముందుగా ఆరోగ్యంగా ఉన్న బాలలను బయటకు తీసుకొచ్చామని ఆయన చెప్పారు. మొత్తం అందర్నీ బయటకు తీసుకురావడానికి రెండు నుంచి 4 రోజులు పడుతుందని ఆయన చెప్పారు. సహాయక చర్యల్లో 13 మంది విదేశీ, ఐదుగురు థాయిలాండ్‌ గజ ఈతగాళ్లు పాల్గొంటున్నారు. జూన్‌ 23న థాయిలాండ్‌లోని తామ్‌ లుయాంగ్‌ గుహను చూడటానికి వెళ్లి 12 మంది బాలలు, వారి కోచ్‌ అందులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఇంకా గుహలో కోచ్ తోపాటు 8మంది చిక్కుకుని ఉన్నారు. దీనికి సంబంధించి థాయిలాండ్‌ నావికాదళానికి చెందిన సీల్స్‌ కూడా తమ ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

Related News