హెల్మెట్, లైఫ్ జాకెట్‌తో.. ‘స్వామియే శరణమయ్యప్ప’

శబరిమల వివాదం అనేక రంగులు మార్చుకుంటూ కొత్తకొత్త మలుపులు తీసుకుంటోంది. గుడిలోకి అన్ని వయసుల మహిళల్నీ అనుమతించాలని, ఆధ్యాత్మిక అంశాల్లో లింగ వివక్ష కూడదని సుప్రీమ్ కోర్ట్ తీర్పునిచ్చిన నేపథ్యంలో.. అయ్యప్ప సన్నిధి ఇప్పుడు ఒక జాతీయ సంక్షోభానికి కేంద్రంగా మారింది.

కోర్ట్ తీర్పు అమలు చేయాల్సిన బాధ్యత ఒకవైపు.. సనాతనవాదుల మనోభావాల్ని గౌరవించాల్సిన సవాల్ మరోవైపు కేరళ సర్కార్‌ని ఇరకాటంలో పడేసింది. కేరళ లెఫ్ట్ ఫ్రంట్ సర్కార్.. తన వామపక్ష భావజాలంతో.. శబరిమలై ప్రాశస్త్యాన్ని భంగపరుస్తోందంటూ హిందుత్వవాదులంటూ ఒక జట్టుగా ఏర్పడి.. సుప్రీమ్ కోర్ట్ తీర్పునకు వ్యతిరేకంగా ఉద్యమానికి మద్దతు తెలిపాయి. ఈ పరిణామం సమస్యను రాజకీయ మలుపును తిప్పేసింది. చివరకు ఇదొక శాంతిభద్రతల సమస్యగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అయ్యప్ప సన్నిధిలోని 18 పడిమెట్లూ ఎక్కితీరతానంటూ భూమాత బ్రిగేడ్ ఫౌండర్ తృప్తి దేశాయ్ శపథం పట్టింది. తన ఎంట్రీని ఏ దేవుడొచ్చినా ఆపలేడన్న ఆమె హెచ్చరికలు కేరళ సర్కార్‌ని చెమటలు పట్టిస్తుండగానే.. మరికొంత మంది మహిళలు ఇదే ‘సాహసానికి’ ఒడిగట్టేశారు. ఇద్దరు మహిళా జర్నలిస్టులు శబరిమలకు వెళ్లాలని నడుం కట్టేశారు.

అక్కడి పోలీసు అధికారుల్ని ఒప్పించి ప్రత్యేక రక్షణ ఏర్పాట్ల నడుమ వాళ్లిద్దరూ 15 కిలోమీటర్ల నడక మొదలుపెట్టారు. ఆందోళనకారులు రాళ్లదాడి చేయవచ్చన్న సూచనలు ఉండడంతో.. తలకు హెల్మెట్, వంటికి లైఫ్ జాకెట్ ధరించి కొండెక్కుతున్న వాళ్ళిద్దరిలో తెలుగు మహిళా జర్నలిస్ట్ కవిత ఒకరు. తెలుగులో కొత్తగా ప్రారంభమైన మోజో టీవీ జర్నలిస్ట్ కవిత.. గుడికి దగ్గరగా వెళ్లగలిగారు. అయితే.. అయ్యప్ప గుడికి కేవలం 500 మీటర్ల దూరం నుంచే వీళ్లిద్దరూ వెనుదిరగాల్సి వచ్చింది. గుడిని మూసివేస్తానంటూ ఆలయ ప్రధాన పూజారి హెచ్చరించడంతో.. వీళ్లకు నిరాశ తప్పలేదు.

Related News