అమెరికాలో తెలుగు విద్యార్థి హత్య

అమెరికా కన్సాస్ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో దుండగుల కాల్పుల్లో వరంగల్‌కు చెందిన 26 ఏళ్ళ శరత్ కొప్పు అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆరు నెలల క్రితం మిస్సోరీ యూనివర్సిటీలో ఎంఎస్ చదివేందుకు శరత్ అమెరికా వెళ్ళాడు. ఇతని స్వస్థలం వరంగల్ లోని కొత్తవాడ. తండ్రి రామ్మోహన్ హైదరాబాద్‌లో బీఎస్ఎల్ఎన్ ఉద్యోగి అని, తల్లి మాలతి వరంగల్ జిల్లా పర్వతగిరిలో పంచాయతీ రాజ్ శాఖలో పని చేస్తున్నారని తెలిసింది.

హైదరాబాద్ అమీర్ పేటలో నివాసం ఉంటున్న శరత్.. హైదరాబాద్‌లో మూడేళ్ళ పాటు ఉద్యోగం చేశాడని తెలుస్తోంది. ఇతడిపై కన్సాస్ రెస్టారెంట్‌లో ఓ నల్ల జాతీయుడు ఐదు సార్లు కాల్పులు జరిపి పారిపోయాడని సమాచారం. తమ కుమారుని మృతితో శరత్ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

కాగా..శరత్ కుటుంబాన్ని తెలంగాణా ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కెటీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పరామర్శించారు. శరత్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

శరత్ పై కాల్పులు జరిపిన అనుమానితుడి వీడియోను పోలీసులు విడుదల చేశారు. పొడవాటి వెంట్రుకలు, చారల టీ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్, వైట్ షూస్ ధరించిన ఓ యువకుడు చేత్తో టవల్, దానివెనుక గన్ ఉంచుకుని రెస్టారెంట్ లో అటూఇటూ తిరుగుతూఉండడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇతని గురించి వివరాలు తెలిపినవారికి 10 వేల డాలర్ల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఇదిలా ఉండగా..వరంగల్ లో ఉన్న శరత్ కుటుంబాన్ని ఆదుకునేందుకు.. తనను శరత్ కజిన్ అని చెప్పుకుంటున్న చౌడవరం రఘు అనే యువకుడు ‘క్రౌడ్ ఫండింగ్’ ప్రచారం ప్రారంభించగా..శనివారం ఒక్కరోజే 45 వేల డాలర్లకు పైగా విరాళం కలెక్ట్ అయినటు తెలుస్తోంది.

Related News