తెలంగాణా ఎన్నికలపై సస్పెన్స్.. 8న తేల్చనున్న హైకోర్టు

తెలంగాణాలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా అభ్యంతరాలపై దాఖలైన మూడు పిటిషన్ల మీద తెలుగు రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు విచారణ చేపట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను అనుమతించిన కోర్టు..దీనిపై విచారణను ఈ నెల 8 వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజున కౌంటర్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించింది. అంటే..ఓటర్ల జాబితా ప్రకటనపై సోమవారం వరకు న్యాయస్థానం స్టే విధించింది.

ఈ నెల 8 న ఓటర్ల తుది జాబితాను ఈసీ విడుదల చేయవలసి ఉంది. అటు-ఓటర్ల జాబితా అవకతవకలపై మూడు పిటిషన్లు దాఖలు కాగా.. రెండింటిని కోర్టు కొట్టివేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను.. రిట్‌పిటిషన్‌కు లోబడి ప్రకటించాలని కూడా ఈసీని హైకోర్టు ఆదేశించింది.


ఓటర్ల జాబితాలో కొన్ని లక్షల ఓట్ల మేర అవకతవకలు ఉన్నాయని, దీన్ని సరిదిద్దాలని కోరుతూ శశిధర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం..ఈ విధమైన పిటిషన్ల మీద హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన విషయం గమనార్హం.

Related News