వేర్వేరుగా నేతల వాదన, పోల్‌పై ఈసీ నిర్ణయం ఎటు?

నాలుగు రాష్ర్టాలతో కలిపి తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగుతాయా? ఇప్పట్లో చెప్పడం కష్టమేనని అంటున్నారు  నేతలు. హైదరాబాద్‌కి వచ్చిన ఈసీ ప్రత్యేక బృందం ముందు రాజకీయ పార్టీలు వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తంచేశాయి. తమతమ వాదనలను బలంగా వినిపించాయి. టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు వీలైనంత తొందరగా ఎన్నికలు జరపాలని కోరాయి.

ఐతే, కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు మాత్రం అఘమేఘాల మీద ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని తేల్చేశాయి. ఈ విషయంలో ఎన్నికల సంఘం విమర్శలపాలు కావద్దని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆరునెలల సమయం ఉందని, పాత షెడ్యూల్‌ ప్రకారమే ఓటర్ల సవరణ చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

విభజన చట్టంలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారు. ఆ మండలాల ఓటర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదన్నారు. ముందస్తు ఎన్నికలపై రాజకీయ పార్టీలు ఒకే అభిప్రాయాన్ని చెబితే నాలుగు రాష్ర్టాలతో కలిపి నిర్వహించాలని తొలుత భావించింది ఎన్నికల సంఘం. ఐతే, ఈసీ బృందం ముందు పార్టీల అభిప్రాయాలు వేర్వేరుగా వుండడంతో ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Related News