బీజేపీ అంటే..? కేటీఆర్ ఫైర్

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తెలంగాణా మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. హైదరాబాద్ సనత్ నగర్‌లో ఆదివారం జరిగిన తెరాస కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలను తప్పు పట్టారు. భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారన్న అమిత్ షా మాటలు అర్థ రహితమని అన్నారు. 2002‌లో గుజరాత్‌లో నరేంద్ర మోదీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళలేదా ? అలాగే 2004లో వాజ్ పేయి ముందస్తుకు వెళ్ళిన మాట మరిచారా ? అని ప్రశ్నించారు. మీరు చేస్తే తప్పు కాదు..మేము చేస్తే తప్పా అని అన్నారు.

బీజేపీ అంటేనే ‘ భారతీయ జూటా పార్టీ ‘ అని, బీజేపీ పాలనలో అచ్చే దిన్ కాకుండా చచ్చే దిన్ వచ్చిందని పేర్కొన్నారు. బీజేపీ అధినేత పేరు అమిత్ షా కాదు..భ్రమిత్ షా అని ఎద్దేవా చేశారు. తెలంగాణాలో ఐదుగురు ఎమ్మెల్యేలను ఆ పార్టీ కాపాడుకుంటే చాలని, ఒక్క కార్పొరేటర్ ను కూడా గెలిపించుకోలేకపోయిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీతోనే తెరాసకు పోటీ అని చెప్పిన ఆయన.. ఎన్నికలంటే కాంగ్రెస్ వారు భయపడుతున్నారని, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. పరీక్షల ముందు నైటవుట్ చేసినట్టు ఉంది ఆ పార్టీ పరిస్థితి అని వ్యాఖ్యానించారు. బీరాలు పలికిన రేవంత్ రెడ్డి ఇప్పుడెక్కడ అని కేటీఆర్ ప్రశ్నించారు.

Related News