వార్తా ఛానళ్లకు టీ సర్కార్ వార్నింగ్‌

మత విద్వేషాలు రెచ్చగొట్టడమేకాదు, వాటికి ప్రాముఖ్యత కల్పించే వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మతపరమైన సున్నిత అంశాల విషయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఐపీసీలోని ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారో అలాంటి చర్యలే చేపడతామని హెచ్చరించింది. అలాంటి వ్యాఖ్యలు ప్రసారం చేసే వార్తా ఛానళ్లపైనా అవే సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఓ వార్తా ఛానల్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీపీఠం మఠాధిపతి పరిపూర్ణానందస్వామి హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు పాదయాత్రకు పూనుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఇరువురిని ఆరునెలల పాటు నగర బహిష్కరణ విధిస్తూ తెలంగాణ డీజీపీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మతపర సున్నిత అంశాలపై కొన్ని వార్తా ఛానళ్లు అభ్యంతరకర రీతిలో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ప్రభుత్వానికి పోలీసు శాఖ నివేదించింది. దీంతో న్యూస్ ఛానళ్ల ప్రసారాలపై నిఘా ఉంచాలని, రెచ్చగొట్టేలా ప్రసారాలు జరిపితే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ప్రభుత్వం ఆదేశించింది. డీజీపీ సూచనల మేరకు వార్తా ప్రసారాలను నిరంతరం సమీక్షించడానికి హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు కూడా జరిగిపోయింది.

READ ALSO

Related News