ముఖ్యనేతలతో విడివిడిగా రాహుల్‌ భేటీ, 20న లిస్ట్!

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూకుడు పెంచడంతో, కాంగ్రెస్ కూడా సన్నాహాలు వేగవంతం చేస్తోంది. రాష్ర్టంలో ఎన్నికల పరిణామాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెలంగాణ ముఖ్యనేతలతో శుక్రవారం భేటీ అయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై రాహుల్.. నేతలతో చర్చించారు. ఈ భేటీలో టీ-కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్, డీకే ఆరుణ, కోమటిరెడ్డి సోదరులు, మల్లుభట్టి విక్రమార్క సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.

ఆ తర్వాత ముఖ్యనేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని అధినేత అడిగి తెలుసుకున్నారు. పార్టీలోె మొదటి నుంచి ఉన్నయువకులకు టికెట్లు ఇస్తే బాగుంటుందని రాహుల్‌కు పలువురు నేతలు చెప్పినట్టు ఢిల్లీ సమాచారం.

మహాకూటమి ఏర్పాటులో సాధించిన పురోగతిపై చర్చించనున్నారు. టీడీపీ, జనసమితి, సీపీఐ ఎన్ని సీట్లను అడుగుతున్నాయి? ఎవరి బలం ఎంత? వంటి అంశాలను రాహుల్‌కి కాంగ్రెస్ నేతలు వివరించారు. పార్టీ బలాబలాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. మొత్తానికి రాహుల్‌తో భేటీ తర్వాత నేతలు ఉత్సాహంగా కనిపించడం కొసమెరుపు.

Related News