అర్ధరాత్రి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అరెస్ట్

నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్ తీయడం, ఆపై మనుషుల అక్రమంగా రవాణా కేసులో కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సోమవారం రాత్రి పఠాన్‌చెరులో పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ పీఎస్‌కు తరలించారు. తను, భార్య, పిల్లల పేరుతో గుజరాత్‌కి చెందిన ముగ్గుర్ని అమెరికాకి తరలించి, అక్కడే వదిలేసి వచ్చినట్టు గుర్తించారు. ఈ కేసులో ఆయన్ని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం ఉదయం గాంధీ ఆసుపత్రిలో జగ్గారెడ్డికి వైద్య పరీక్షలు చేయించారు. 

తాను, తన భార్య, పిల్లలు అమెరికా వెళ్తున్నట్లు 14 ఏళ్ల కిందట పాస్ పోర్ట్ తీసుకుని అమెరికా వెళ్లారని తర్వాత జగ్గారెడ్డి ఒక్కరే తిరిగివచ్చారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరోవైపు జగ్గారెడ్డి అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని కొందరు కాంగ్రెస్ నేతలు బేగంపేటలోని డీజీపీ నివాసానికి వెళ్లారు. నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా జగ్గారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

2001లో తప్పుడు పత్రాలు సమర్పిస్తే ఇప్పటివరకు అధికారులు ఏం చేశారని ప్రశ్నించారు ఉత్తమ్. ఈ కేసులో పెద్ద తలకాయల ప్రమేయం వుందని, వాళ్లని అరెస్ట్ చేసేవరకు వదలబోమని హెచ్చరించారు. తప్పుడు కేసులతో కాంగ్రెస్ నేతలను భయాందోళనకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఈనెల 12న సంగారెడ్డిలో  కాంగ్రెస్ సభను అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని, ఆ సభకు కచ్చితంగా జరిపి తీరుతామని స్పష్టంచేశారు ఉత్తమ్. దీంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీటెక్కింది.

READ ALSO

Related News