మీరా.. నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చేది?

నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చే దమ్ముందా మీకు.. అంటూ మరోసారి సవాల్ విసిరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గాంధీభవన్‌లో కూర్చుని సీట్లు అమ్ముకునే వాళ్లు నాకు షోకాజ్ నోటీసు ఇవ్వడమా అని ఆయన ప్రశ్నించారు. తాను నిన్న చేసిన కామెంట్లకి కట్టుబడి ఉన్నానన్నారు. తాను చేసిన సూచనలను పాజిటివ్‌గా తీసుకోవాలని ఆయన అన్నారు. పంపిన షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వాలని తనకు రెండు రోజులు టైం ఇచ్చారని అయితే, తాను ఈరోజే సమాధానం చెబుతున్నానని ఆయన అన్నారు.  కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన సురేష్‌రెడ్డిని కమిటీలో నియమించడం చూస్తుంటే టీకాంగ్రెస్ పరిస్థితి ఏంటో అర్థమవుతోందన్నారు. అసలు ఈ కమిటీలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. మ్యానిఫెస్టో కమిటీ ఎందుకు వేశారో అర్థం కావడంలేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం తన ఉద్దేశ్యం కాదన్నారు. రాహుల్ నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. క్లోజ్డ్ రూంలో మాట్లాడితే మీరు పట్టించుకోరు.. ఇలా బహిరంగంగా మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.

 

‘కుంతియాకు ఆ దమ్ముందా?’

ఇదిలాఉండగా, పార్టీ నేతల పట్ల గురువారం తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి కాంగ్రెస్.. శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో ఆదేశించింది. కాగా.. కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరైన రాజగోపాలరెడ్డి చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ కుంతియా అంతకుముందు అన్నారు. పార్టీకి నష్టం జరిగేలా మాట్లాడితే క్రమశిక్షణ కమిటీ తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ కమిటీలన్నీ బ్రోకర్లతో నిండిపోయాయని, వార్డు మెంబర్లుగా కూడా గెలవలేనివారిని కమిటీల్లో వేశారని కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పైరవీకారులకు టికెట్లు ఇస్తే పార్టీకే నష్టమని పేర్కొన్న ఆయన.. కుంతియాను రాష్ట్రానికి పట్టిన పెద్ద శని అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. అటు-టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజగోపాల రెడ్డిని పరోక్షంగా హెచ్చరించారు. ‘గీత’ దాటవద్దని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే నేతలకు వార్నింగ్ ఇచ్చారని అన్నారు. హద్దులు దాటి మాట్లాడితే చర్యలు తప్పవన్నారు.

‘వార్డ్ మెంబర్లుగా కూడా గెలవలేనివాళ్లకు మేము లొంగాలా’, ‘బ్రోకర్ నాకొడుకుల్ని తీసుకొచ్చి కమిటీల్లో పెట్టిండ్రు..’, ‘వందమంది కుంతియాలొచ్చినా నా బీఫారంని ఆపలేరు..’.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధిష్టానం మీద వాడిన దుర్భాషలో ఇది కొంత భాగం మాత్రమే. ఈయన్ను కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం శిక్షిస్తుందా లేక ఉపేక్షిస్తుందా? అనేది అటుంచితే.. ఏఐసీసీ ఇంచార్జ్‌ని పట్టుకుని ‘శనిగాడు’ అని సంబోధించిన వ్యక్తికి అధిష్టానం ‘లొంగడం’ ఒక అసాధారణ విషయం. కానీ.. అంతర్గత ప్రజాస్వామ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా పిలిపించుకునే కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ సహజమే! ఏదేమైనా.. కోమటిరెడ్డి సోదరుల్ని వదులుకుంటే నల్గొండ జిల్లా మొత్తాన్ని వదులుకున్నట్లేనన్న క్లారిటీ.. కాంగ్రెస్ పార్టీ సహనాన్ని పరీక్షిస్తోంది.

Related News