తెలంగాణలో బీజేపీ కొత్త ప్లాన్, త్రిపుర వ్యూహానికి..

తెలంగాణలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఓ వైపు టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుండగా, మరోవైపు సర్వేలతో నిమగ్నమైంది కాంగ్రెస్. ఇక మిగిలింది బీజేపీ మాత్రమే. ఈ పార్టీ హడావుడి ఇప్పటివరకు తెలంగాణలో పెద్దగా కనిపించలేదు. కాకపోతే త్రిపుర వ్యూహాన్ని అమలు చేయాలని ఆలోచన చేస్తోంది తెలంగాణ బీజేపీ నాయకత్వం. ఇందులోభాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఆరెస్సెస్‌ సమావేశానికి బీజేపీ, విశ్వ హిందూపరిషత్‌, సంఘ్‌, కిసాన్‌సంఘ్‌, మజ్దూర్‌ సంఘ్‌, ఏబీవీపీ, భజరంగ్‌దళ్‌, స్వదేశీ జాగరణ్‌మంచ్‌ తదితర సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలని నేతలు చర్చించారు.

త్రిపుర తరహా వ్యూహాన్ని అమలు చేసి తెలంగాణలో పార్టీకి విజయం అందించాలని సంఘ్‌ నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు రెండు శాతం ఓట్లు కూడా లేని త్రిపురలో బీజేపీ, సంఘ్‌, దాని అనుబంధ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరును కలిసి అభివృద్ధి అజెండాను వివరించారు. ఈ క్రమంలో కమ్యూనిస్టుల కంచుకోట బద్దలై, బీజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేసుకున్నారు నేతలు. అలాంటి వ్యూహం తెలంగాణలో సాధ్యమా అన్నదే అసలు పాయింట్. గడిచిన నాలుగేళ్లలో తెరాస చేపడుతున్న పనులు, ప్రాజెక్టులు అద్భుతంగా వున్నాయంటూ కేంద్రమంత్రులే చెబుతున్నారు. ఈ క్రమంలో అభివృద్ధి అంటూ ఓటర్ల వద్దకు ఎలా వెళ్తారని ఆ పార్టీలోని దిగువ స్థాయి నేతలు చర్చించుకుంటున్నారు. కాకపోతే కేంద్ర పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తే, లోక్‌సభ ఎన్నికల నాటికి మంచి ఫలితాలు వస్తాయన్నది ఓ అంచనా!

Related News