టీఆర్ఎస్‌లో సెగలు, అభ్యర్థులను మార్చాలంటూ

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థుల వ్యూహాన్ని చిత్తు చేసేందుకు వ్యూహాత్మకంగా దూసుకెళ్తున్న అధికార పార్టీకి సొంత పార్టీ నేతలు తలనొప్పిగా మారారు. అసెంబ్లీ రద్దు రోజునే అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్.. అసమ్మతి సెగల నుంచి బయటపడ లేకపోతోంది. పలువురు మంత్రుల మద్దతుదారులు సైతం కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు. ప్రకటన వచ్చి రెండువారాలు గడుస్తున్నా కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులను బుజ్జగించ లేకపోతోంది. ఈ విషయంలో నేతలు ప్రయత్నాలు చేసినప్పటికీ నాయకులు ఏమాత్రం వినడంలేదు. అభ్యర్థులను మార్చాలని అధిష్టానానికి అల్టిమేటం ఇస్తున్నారు.

నిమజ్జనం అయ్యేలోపు అందరికీ సర్ధిచెప్పి ప్రచారంలో నిమగ్నం కావాలని గులాబీ బాస్ ప్లాన్ చేసుకోగా, కొన్నిచోట్ల నేతల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. చెన్నూరులో నల్లాల ఓదేలును అధిష్టానం పిలిపించి మాట్లాడిన తర్వాత మెత్తబడ్డారు. ఈలోగా ఓ కార్యకర్త ఆత్మహత్యతో అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి బాల్కా సుమన్‌కి క్లిష్టమైన పరిస్థితి నెలకొంది. అలాగే మెహబూబాబాద్, వైరా, ముధోల్, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, భువనగిరి, నాగార్జునసాగర్, మక్తల్, రామగుండం వంటి నియోజకవర్గాల్లో అభ్యర్థిని మార్చాలంటూ తెలంగాణ భవన్ ఇన్‌ఛార్జ్‌కి ఫిర్యాదు చేశారు స్థానిక నేతలు. స్టేషన్ ఘనపూర్‌లో రాజయ్యకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వర్గం బలప్రదర్శనలు చేస్తోంది. మునుగోడు అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని మార్చాలంటూ అసమ్మతి నేత వేనెపల్లి చండూరులో భారీ సభ చేపట్టారు.

READ ALSO

Related News