చినబాబు చేసింది తప్పే.. పెదబాబు దగ్గర టీజీ పంచాయితీ!

వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను మంత్రి లోకేష్ ప్రకటించడంపై ఎట్టకేలకు ఆ పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ తనదైనశైలిలో స్పందించారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత స్పందిస్తానని చెబుతూనే, మనసులోని ఆవేదనను బయటపెట్టారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రకటించడం కాసింత ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు.

బీఫామ్ ఇచ్చే ముందు అభ్యర్థిని అధినేత ప్రకటిస్తారు కానీ, ముందుగానే చినబాబు ఎందుకు ప్రకటించారో అర్థంకాలేదన్నారు. బహుశా లోకేష్‌ను మోహన్‌రెడ్డి హిప్నటైజ్ చేసివుంటారని అన్నారు. మరోవైపు టీజీ వ్యాఖ్యలపై అదేస్థాయిలో రియాక్ట్ అయ్యారు మోహన్‌రెడ్డి. రాజకీయాల్లో లోకేష్ కొత్తపంథాను అనుసరిస్తున్నారని, హిప్నటైజ్ చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలోనే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారని గుర్తుచేశారు. ముందుగా పేర్లను ప్రకటించడం వల్ల అభ్యర్థుల గెలుపు అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇదిలావుండగా కర్నూలు ఎమ్మెల్యే టికెట్‌ని తన కొడుక్కి ఇప్పించుకునేందుకు టీజీ చాన్నాళ్లుగా యత్నిస్తున్నారు. అంతేకాదు ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో టీజీ భరత్ చురుగ్గా పాల్గొంటున్నారు. మరి ఈ వ్యవహారానికి అధినేత చంద్రబాబు ఎలా ముగింపు ఇస్తారో చూడాలి.

Related News