వైసీపీ పరార్.. మాది బ్లాక్ బస్టర్.!

పార్లమెంట్‌లో టీడీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంపై చర్చకు అంగీకరిస్తున్నామని స్పీకర్ ప్రకటించడంతో టీడీపీ నేతలు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. పనిలోపనిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఓ రేంజ్‌లో ఫైరవుతున్నారు. మంత్రి నారాయణ, టీడీపీ ఎంపీలు తోట నర్శింహం, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు వైసీపీపై తీవ్ర విమర్శలకు దిగారు. తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రామహాజన్ స్వీకరించడం టీడీపీ సాధించిన గొప్ప విజయమని మంత్రి నారాయణ అన్నారు. బీజేపీ-వైసీపీల వైఖరిని లోక్‌సభ సాక్షిగా ఎండగడతామన్నారు.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదని విమర్శించారు. తమ అవిశ్వాస తీర్మానానికి విపక్షాలన్నీ సంఘీభావం ప్రకటించాయని… అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎంపీ తోట నరసింహం అన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు మంచి అవకాశం దొరికిందని ఆయన చెప్పారు. ఇక, వైసీపీ ఎంపీలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని తెలిసే… ముందస్తుగా వారు రాజీనామాలు చేశారని ఆరోపించారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు సహా 14 అంశాలపై మాట్లాడతామని చెప్పుకొచ్చారు. మోదీ ప్రభుత్వంపై దేశ ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో ఈ చర్చతో తెలుస్తుందన్నారు. శుక్రవారం నాడు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న సంగతి తెలిసిందే.

Related News