‘సోయిలేకుండా సొల్లుకబుర్లా?’

కాంగ్రెస్ సీనియర్ నేతలు టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఫ్యామిలీపైనా, టీఆర్ఎస్ నేతలపైనా ముప్పేటదాడికి దిగారు. జైపాల్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, మధుయాష్కీ పాత చిట్టాలు తెరిచారు. తిట్ల దండకం అందుకున్నారు. రాఫెల్ వ్యవహారంలో మోదీ పాత్రపై జైపాల్ రెడ్డి నిప్పులు చెరగ్గా, ఒక అడుగుముందుకేసిన మధుయాష్కీ కేసీఆర్ పైనా, అతని కుటుంబ సభ్యులమీదా, ఎంపీ వినోద్ మీదా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఎంపీ వినోద్ సోయిలేకుండా సొల్లుకబుర్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలకు అనేక ప్రశ్నలు సంధించారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టింది మేము.. మిలియన్ మార్చ్ కు ప్రభుత్వ అనుమతి ఇప్పించింది మేము.. ఎమ్మెల్యే కాలనీస్ లో కేసీఆర్ ని తీసుకొచ్చి, డాక్టర్ వివేక్ సమక్షంలో జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకోవద్దన్న టీఆర్ఎస్ దద్దమ్మలకి బుద్ధి చెప్పింది నేను కాదా? అంటూ ఎంపీ వినోద్ పై మాటల తూటాలు పేల్చారు. నా దగ్గరకొచ్చి బ్రతిమాలుకున్న రోజులు మర్చిపోయావా అంటూ మధుయాష్కీ విరుచుకుపడ్డారు.

 

తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ ఎంపీల పాత్రపై చర్చకు సిద్ధమా అని వినోద్ కు మధుయాష్కీ సవాల్ విసిరారు. తనకు ఏ పదవీవద్దు, తెలంగాణకు కాపలా కుక్కలా మాత్రమే ఉంటానని.. దళితుడ్ని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ సీఎం పదవి ఎందుకు తీసుకున్నాడని ప్రశ్నించారు. కోట్ల రూపాయలు విలువచేసే కార్లలో తిరుగుతున్న కేసీఆర్ కూతురు కవిత, హరీష్ రావు దండుకుంటున్నది ఎంత అని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటులో అత్యంత కీలకమైన తెలంగాణ ఎంపీల పాత్రలేదంటే టీఆర్ఎస్ నేతలు పురుగులు పడి చస్తారని మధుయాష్కీ మండిపడ్డారు.

Related News