లైన్ క్లియర్.. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి పరిపూర్ణానంద!

తెలంగాణ బీజేపీ పరిపూర్ణావస్థకు చేరుకుంది. నాయకత్వ లేమితో, కమర్షియల్ వ్యాల్యూస్ కొరవడి కొట్టుమిట్టాడుతున్న టీ-కమల శిబిరానికి ఎట్టకేలకు ఉపశమనం దొరికింది. ‘మాకూ ఒక బాహుబలి వచ్చేస్తున్నాడు’ అంటూ ఎప్పట్నుంచో చెప్పుకుంటూ వస్తున్న కమలనాధులు.. ఆ లోటును పూడ్చుకోగలిగారు.

విషయం ఏమిటంటే.. నిన్నటివరకూ బీజేపీ రహస్య ప్రేమికుడిగా, సానుభూతిపరుడిగా వున్న శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద ఇప్పుడు బీజేపీలో చేరిపోయారు. ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర నాయకులెవ్వరినీ భాగస్వాములు కానీయకుండా నేరుగా పార్టీలో చేర్చుకున్న బీజేపీ అధిష్టానం.. పరిపూర్ణానందకు కీలక హోదా కల్పించే అవకాశం ఉన్నట్లు సంకేతాలిచ్చింది.

”దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ చేస్తున్న సేవలో నేను కూడా పాలు పంచుకోడానికి సిద్ధం. అమిత్ భాయ్ నేతృత్వంలో పని చేయడానికి సిద్ధంగా వున్నా..! బీజేపీ సిద్ధాంతాల్ని అన్ని వర్గాల్లోకీ చేర్చేందుకు ఇరవై నాలుగుగంటలూ కష్టపడ్డానికి మనసావాచా కట్టుబడి ఉంటా”నని చెప్పుకొచ్చారు. ‘నాకు ఎటువంటి ఆశలూ లేవు. తెలుగు ప్రజలు ఇప్పటికే నాకు చాలా ఇచ్చారు. ఇంతకంటే ఏ పదవీ అవసరం లేదు.. అంటూ ముగించారు.

కానీ.. తెలంగాణ బీజేపీ తాజా బ్రాండ్ అంబాసిడర్ ఆయనేనని.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుంటారని కొన్నాళ్లుగా మీడియాలో వార్తలొచ్చాయి. మొదట ఎంపీ టిక్కెట్‌తో సరిపెడతారని చెప్పినా.. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో.. హిందుత్వ ఓటు బ్యాంకును పోగొట్టుకోకుండా ఉండాలంటే.. పరిపూర్ణానంద సేవల్ని ‘అంతకు మించి’ ఉపయోగించుకోవాలని తెలంగాణ బీజేపీ యోచిస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఆయన్ను అసెంబ్లీకి పంపే ప్లాన్ చేస్తోంది బీజేపీ. ఆయుర్వేదిక్ ఫార్మా వ్యాపారంతో పాటు.. మీడియా సంస్థను కూడా నిర్వహిస్తున్న పరిపూర్ణానంద.. తెలంగాణ బీజేపీని ఎంత మేరకు గట్టెక్కిస్తారన్నది సస్పెన్స్!

Related News