కేటీఆర్‌ని సాయం కోరిన పీసీసీ చీఫ్ ఉత్తమ్..!

తెలంగాణలో ప్రధాన రాజకీయ శత్రువులు తెరాస.. కాంగ్రెస్! ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనాల్సిందే! కానీ.. ఈ రెండు పార్టీల పెద్దల మధ్య ఒక ఆసక్తికరమైన రాయబారం నడిచింది. ఒక పేద కుటుంబం కోసం..! ఎప్పుడూ ప్రభుత్వ పనితీరును దుయ్యబడుతూ శాపనార్థాలు పెట్టే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఐటీ మంత్రి కేటీఆర్‌కి కూల్‌గా ఒక ట్వీట్ చేశారు. ఒక నిరుపేద ముదుసలి జంట.. కూలిపోడానికి సిద్ధంగా వున్న చిన్నపాటి పూరిగుడిసె.. ఈ ఫోటోని పోస్ట్ చేస్తూ.. ఈ పూరిగుడిసెకు సంబంధించి రూ. 500 ఆస్తి పన్ను కట్టించుకుని అధికారులిచ్చిన రశీదు కాపీని కూడా జత చేశారు. దయచేసి వీళ్ళు కట్టిన పన్నును వెనక్కి ఇప్పించండి.. ఒక చిన్న గూడు కట్టివ్వండి.. అంటూ రిక్వెస్ట్ చేశారు మంత్రిగారిని. వెంటనే స్పందించిన కేటీఆర్.. ”ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు.. వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్ చేయమని ఇప్పుడే కలెక్టర్‌ని ఆదేశిస్తా”నంటూ హామీ ఇచ్చారు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్‌లోని సదరు కటికపేద కుటుంబం ఈ విధంగా వార్తల్లోకెక్కి.. ఎట్టకేలకు లబ్ది పొందినట్లయింది!

Related News