కూచిపూడికి గొప్ప వరం..సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి

కృష్ణా జిల్లా కూచిపూడిలో సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రిని ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ప్రారంభించారు. 150 గ్రామాలకు ఆధునిక వైద్యం అందించేందుకు టీవీ 9 సహకారంతో విరాళాల సేకరణ జరిగింది. ఈ ఆసుపత్రిని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. 200 పడకల  మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటు కావడం వెనుక టీవీ 9 సీ ఈ ఓ రవి ప్రకాష్ చేసిన కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని  అన్నారు. ఆసుపత్రికి విరాళాలు ఇచ్చినవారు చరిత్రలో మిగిలిపోతారని, కూచిపూడి అంతర్జాతీయ టెర్మినేషన్‌గా తయారవుతుందని పేర్కొన్నారు.

ఈ విధమైన ఆసుపత్రులు మరిన్ని రావాలని ఆయన కోరారు. టీవీ 9 సీ ఈ ఓ  రవి ప్రకాష్,  కూచిభొట్ల ఆనంద్‌లను ఆయన అభినందించారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఓ మహిళ సుమారు 6 లక్షల విరాళం ఇస్తానని ప్రకటించిందని, అయితే  త్వరగా ఆసుపత్రి ప్రారంభించాలని కోరుతూ అంత విలువైన నగలను ఆమె తాకట్టు పెట్టిందని  రవిప్రకాష్ తెలిపారు. ఒక రిక్షా కార్మికుడు వెయ్యి రూపాయలు డొనేట్ చేశాడని, క్యాన్సర్ మృత్యు శయ్యలో ఉన్న ఓ పేషంట్ 20 వేల విరాళం ప్రకటించాడని , మానవత్వానికి ఇదే నిదర్శనమని అన్నారు.

 

ప్రజల్లో ఉన్న స్ఫూర్తిని ఇలాంటి ఘటనలు నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు, ఈ ఆసుపత్రి నిర్మాణంలో అందరి కష్టం ఉందన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి కూచిభొట్ల ఆనంద్ చూపిన చొరవ అభినందనీయమన్నారు. సమాజంలో కుల జాడ్యం పెరిగిపోవడంపట్ల ఆయన విచారం వ్యక్తం చేస్తూ..అమెరికాలో సైతం కుల రొచ్చు బయటపడడం బాధాకరమని అన్నారు. ఈ రొచ్చును  నిర్మూలించాలని పిలుపునిచ్చారు. కులం ఓ వెనుకబాటుతనమని ఆయన వ్యాఖ్యానించారు. అటు- ఈ సంజీవని ఆసుపత్రి నిర్మాణానికి టీవీ 9 సీ ఈ ఓ రవిప్రకాష్ తమ సొంత డబ్బు ఇవ్వడమే కాకుండా..తమ ఛానల్ ద్వారా విరాళాల సేకరణకు పూనుకోవడం హర్షణీయమని చంద్రబాబు పేర్కొన్నారు.

ఓ మంచి కార్యానికి అందించే చేయూత ఎంతో సంతృప్తినిస్తుందని ఆయన అన్నారు. ఈ ఆసుపత్రికి రూ. 10 కోట్ల విరాళాన్ని ఆయన ప్రకటించారు.

Related News