బాబుకు చిక్కులు, ఢిల్లీలో వైసీపీ- బీజేపీ నేతల భేటీ

బీజేపీ- వైసీపీ ఒక్కటేనంటూ చాన్నాళ్లుగా చెబుతూ వస్తున్నారు టీడీపీ నేతలు. ఈ వాదనకు ఊతమిస్తూ గురువారం దేశ రాజధాని ఢిల్లీలో వైసీపీ- బీజేపీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు! ఇప్పుడు ఈ విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ రామ్‌మాధవ్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణలతోపాటు కీలక నేతలు హాజరయ్యారు. ఈ భేటీ వివరాలను అమిత్‌షాకు వివరించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కొన్ని మీడియా ఛానెళ్లకు చిక్కాయి!

ఏపీ ప్రభుత్వ ఖర్చులు, కేటాయింపులపై కొన్నిరోజులుగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పీఏసీ ఛైర్మన్ బుగ్గన. భారీస్థాయిలో టీడీపీ సర్కార్ అవినీతికి పాల్పడుతోందని, ఆయా ఖాతాలను పరిశీలించి నిజాల నిగ్గుతేల్చాలన్నది ఆయన డిమాండ్. ఇప్పడు ఆ వివరాలను నివేదిక రూపంలో బీజేపీ నేతలకు బుగ్గన ఇచ్చారని ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ ఆధారాలతో న్యాయస్థానంలో ప్రభుత్వంపై పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఐతే, వైసీపీ నేతతో భేటీ వాదనను బీజేపీ నేతలు తోసిపుచ్చారు.

గురువారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు.. ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఢిల్లీ వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. బీజేపీ నేతలను రహస్యంగా కలవడం ఏంటని విమర్శించారు. బుగ్గన.. అమిత్‌షాను కలవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా నీచమైన పరిస్థితి ఏనాడూ చూడలేదని, బీజేపీ- జగన్‌ ఒకటేనని చెప్పడానికి ఇంతకన్నా రుజువు  ఏం కావాలన్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడానికి ముందే ఈ భేటీ జరగడం గమనార్హం.

Related News