2019 ఎన్నికలే టార్గెట్.. బీజేపీని ఓడించాల్సిందే… రాహుల్

2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా పని చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తమ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఆ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. కాంగ్రెస్‌పార్టీ ‘ వాయిస్ ఆఫ్ ఇండియా ‘ (భారత ప్రజా వాణి) రోల్ వహించాలని అన్నారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, పేదలపై ఉక్కుపాదం మోపుతున్న బీజేపీని గట్టిగా ఎదుర్కొనే బాధ్యతను సమష్టిగా చేపడదామన్నారు.

పార్టీ పగ్గాలు చేపట్టాక మొట్టమొదటిసారిగా తన అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలోని పార్లమెంట్ అనెక్స్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో మాట్లాడిన ఆయన.. కొత్తగా పునర్వ్యవస్థీకరించిన ఈ కమిటీ.. అనుభవజ్ఞులు, రాజకీయ మేధావులతో కూడినదని, ఇది..గత, ప్రస్తుత, భవిష్యత్ పరిణామాల మధ్య ఏర్పడిన వారధివంటిదని అన్నారు.

పార్టీ అధ్యక్షుడి హోదాలో  రాహుల్ పాల్గొన్న ఈ సమావేశం.. 2019 ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది.

ఈ ఏడాది చివర్లో జరగనున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, అనంతరం జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఏయే పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలన్న అంశం కూడా ఈ మీటింగ్ లో ప్రస్తావనకు వచ్చింది. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను కూడా ఇందులో చర్చించారు. ఈ సమావేశంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, ఏ.కె. ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ లీడర్లు, పార్టీకి చెందిన మాజీ సీఎంలు పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, బీజేపీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని సోనియా వ్యాఖ్యానించారు.

Related News