లోక్‌సభలో రాహుల్ కితకితలు!

రాహుల్ అగ్రెసివ్ మోడ్‌లోకి వచ్చేశారు. టీడీపీ అవిశ్వాస అస్త్రాన్ని తనకు అనువుగా వాడుకుంటూ.. మోదీ మీదకు యుద్ధం మొదలుపెట్టాడు. ప్రసంగంలో అనుభవ రాహిత్యం కనిపిస్తున్నప్పటికీ.. దూకుడు కొనసాగించుకుంటూ వెళ్లారు. దేశీయ, విదేశీ అంశాలని ప్రస్తావిస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని వరుస సెటైర్లతో ముంచేత్తేశారు ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్. ఒకానొక దశలో ప్రధాని మోదీ దగ్గరికెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు కూడా. మొత్తమ్మీద రాహుల్ ఇవ్వాల్టి సభా వ్యవహారాల్లో ‘స్టార్ ఆఫ్ ది డే’గా మారారు.

ఇదంతాఒకెత్తయితే, రాహుల్ లోక్ సభలో కన్నుకొట్టుడు వ్యవహారం హాట్ టాపిక్ అయింది. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్‌సభలో బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ విరుచుకుపడ్డారు. ప్రసంగం చివరిలో ప్రధాని నరేంద్రమోదీ దగ్గరకు వెళ్లి కోపాన్ని తగ్గిస్తానంటూ ఆలింగనం చేసుకున్నారు. ఊహించని ఈ చర్యతో మోదీ తొలుత తత్తరపాటుకు గురైనా ఆ తర్వాత తేరుకుని రాహుల్ భుజం తట్టి నవ్వారు. అయితే, ప్రసంగం పూర్తయిన అనంతరం రాహుల్ తన సీటులోకి వెళ్లి కూర్చుని పక్కకి చూస్తూ కన్నుగీటారు. ఈ చర్య సమావేశాలు చూస్తున్న అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఒక్కసారిగా అటు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ రాహుల్ కన్నుకొట్టుడు వ్యవహారం హల్ చల్ చేస్తోంది.

అవిశ్వాసంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొత్తంగా ప్రధాని మోదీ మీద విరుచుకపడ్డారు. అప్పుడప్పుడు ఛలోక్తులు, చెణకులు విసుతుతూనే మోదీ ప్రభుత్వంపై ధ్వజ మెత్తారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, రాఫెల్ విమానాల కొనుగోలు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కొడుకు అవినీతి, కర్ణాటక రైతుల దుస్థితి వంటి వివిధ అంశాలను ఆయన లేవనెత్తారు. మొదట..టీడీపీ ఎంపీ చేసిన ప్రసంగంలో ఏపీ ప్రజల బాధ, ఆవేదన అర్థమైందని అంటూ మొదలు పెట్టిన ఆయన.. 21 శతాబ్దపు రాజకీయ ఆయుధానికి ఏపీ ప్రజలు బాధితులుగా మారారని, ప్రధాని అనే పదానికి ఈ దేశ ప్రజలు అర్థం వెతుక్కుంటున్నారని విమర్శించారు. దేశ ప్రజల్లో ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో 15 లక్షలు, 2 కోట్లమందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆ హామీ ఏమైందని ఎద్దేవా చేశారు.

దేశంలో కేవలం 20 మంది బడా వ్యాపారులకే మోదీ ప్రయోజనం చేకూరుస్తున్నారు. రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయి. యూపీయే హయాంలో ఒక్కో రాఫెల్ విమానం ఖరీదు రూ.520 కోట్లు. ప్రధాని ఫ్రాన్స్ వెళ్లి ఎవరితోనో చర్చ జరిపారు. ఇప్పుడు ఆ విమానం ఖరీదు రూ. 1600 కోట్లు. మోదీ ఎవరితో ఆ దేశం వెళ్ళారో చెప్పాలి. నేను స్వయంగా ఆ దేశానికి వెళ్లి అధ్యక్షుడిని కలిస్తే ఎలాంటి ఒప్పందం జరగలేదని చెప్పారు అని రాహుల్ తెలిపారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అబద్ధాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఒక వ్యక్తికి రాఫెల్ కాంట్రాక్టు వెళ్లిందని, దీంతో అతనికి వేలకోట్ల లాభం చేకూరిందని ఆయన పేర్కొన్నారు. అమిత్ షా కొడుకు అవినీతిపై మోదీ నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. మన దేశ ప్రజల్ని మోదీ మోసం చేస్తున్నారని, చైనా వెళ్లి ఆ దేశా ధ్యక్షుడితో అజెండా లేకుండా చర్చలు జరిపారని రాహుల్ అన్నారు. ప్రపంచమంతా పెట్రోలు ధరలు తగ్గితే మన దేశంలో చుక్కలను అంటుతున్నాయని రాహుల్ ఆరోపించారు. కర్ణాటకలో రైతులకు మద్దతు ధర విషయంలో ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. ‘ మీరు నన్ను ద్వేషించారు..పప్పూ అని హేళనగా సంబోధించారు. కానీ..నేను మాత్రం మీ మీద ద్వేష పూరిత వ్యాఖ్యలు చేయలేదు.. మీపై ఉన్న ద్వేషాన్ని ప్రేమగా మార్చుకున్నా..’ అని రాహుల్ తన ప్రసంగం ముగించారు.

READ ALSO

Related News