కోదండరాంకి ‘రాజ్యసభ’..!

పాత ప్రతిపాదనని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చే యోచన చేస్తోంది తెలంగాణ బీజేపీ. కేసీఆర్ దూకుడు నేపథ్యంలో ఒంటరైపోయిన టీబీజేపీ నాయకులు.. ఏం చేయాలో తోచని అయోమయంలో పడిపోయారు. మిగతా పార్టీలన్నీ దూరంగా జరగడం, అధికార తెరాస ‘డబుల్ గేమ్’ ఆడుతుండడం.. ఇక్కడి కమలనాథుల్ని పిచ్చెక్కించేలా చేస్తోంది. సిట్టింగ్‌లనైనా కాపాడుకుందామన్న ఆఖరి ప్రయత్నాల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ ‘లోపాయకారి సాయం’ చేస్తారన్న ఆశలు ఒకవైపు ఉన్నప్పటికీ.. తమ వంతు ప్రయత్నాల్ని మాత్రం తెలంగాణ బీజేపీ నేతలు వదులుకునేలా లేరు. ‘తెలంగాణ జన సమితి’ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్న ప్రొఫెసర్ కోదండరాం వైపు ‘ఆశ’గా చూస్తున్నారు తెలంగాణ కమలనాధులు.

పొత్తు పెట్టుకుందాం రా అంటూ సైగ చేశారో లేక.. తానే ముందడుగేశారో గానీ.. టీజేఎస్ అద్యక్షుడు కోదండరామ్ బీజేపీ నేత కిషన్ రెడ్డితో భేటీ అయినట్లు వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు మాత్రమే ఇస్తాననడంతో వాళ్ళతో జట్టు కట్టడానికి అంగీకరించని కోదండ.. బీజీపీ గొడుగు కిందయితే పిడికెడు నిండా టిక్కెట్లు దొరుకుతాయని ఆశిస్తున్నట్టు సమాచారం. బీజేపీ కూడా.. ప్రజాసంఘాల అండాదండా వున్న కోదండను కలుపుకుని ఎన్నికలకు వెళితే ఎంతోకొంత లబ్ది పొందవచ్చని భావిస్తోంది. గతంలో కోదండకు తాము ఆఫర్ చేసిన ‘రాజ్యసభ’ టిక్కెట్‌‌ని బోనస్‌గా ఇవ్వడానికి సైతం తెలంగాణ బీజేపీ సిద్ధంగా ఉందట. ఈమేరకు అధ్యక్షుడు అమిత్ షా దగ్గర హామీ తీసుకునేందుకు మంతనాలు కూడా షురూ అయినట్లు చెబుతున్నారు. ఈ డీల్ కనుక ఓకె అయితే.. ప్రొఫెసర్ కోదండరాం కేరాఫ్ అడ్రస్ పెద్దల సభకు మారినా మారొచ్చు.

Related News