జేసీ దివాకర్ ఎంత డబ్బడిగారు?

‘తాడిపత్రి టెన్షన్’ ఇప్పుడు పూర్తిగా తప్పుదోవ పట్టింది. వినాయక విగ్రహ నిమజ్జనం సందర్భంగా పొరుగునున్న గ్రామస్తులకు, ప్రబోధానంద స్వామి అనుచరులకు మధ్య జరిగిన ‘హింసాకాండ’తో మొదలైన రగడ ఇప్పుడు.. పోలీస్ అధికారుల సంఘానికి, అనంత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మధ్య ఇగో సమస్యగా మారింది. ఒకరినొకరు ‘నాలిక తెగ్గోసుకుందాం రా’ అనేదాకా వెళ్ళింది. ఇక్కడ దాదాపుగా జేసీ కార్నర్ అయినట్లేనని, విధిలేని పరిస్థితుల్లోనే పోలీసులకు సంజాయిషీ చెప్పడానికే మీడియా ముందుకొచ్చారని చెబుతున్నారు. ఆ విషయం అలా ఉంచితే.. ఇప్పుడు మళ్ళీ.. ప్రభోధానంద స్వామి లైన్లోకొచ్చేశాడు.

జేసీని టార్గెట్ చేసుకుని అనేక ఆరోపణలు చేశాడు ప్రభోధానంద. ఆయన అడిగిన డబ్బు ఇవ్వనందుకే నామీద కక్ష కట్టారంటూ అభియోగం మోపారు. తమ ఆశ్రమం మొత్తాన్ని జిల్లాలో లేకుండా చేయాలన్న కుట్ర జేసీ ఎప్పటినుంచో చేస్తున్నారన్నారు. ”పదిహేనేళ్ల కిందట నా ఆశ్రమంలో కృష్ణమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించినప్పుడు ఆయన కొంత మొత్తం డబ్బు అడిగారు. అది ఇవ్వలేదన్న కోపంతో ఆయన అప్పుడప్పుడూ బెదిరించేవారు. ఇప్పుడు నిమజ్జన గొడవను ఆసరాగా చేసుకుని నా పంచాయతీని ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్లారు. జేసీ ఒక లంచగొండి.. అబద్ధాలకోరు” అంటూ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు స్వామి ప్రబోధానంద. తన ఆశ్రమం మీద ఆక్టోపస్ పోలీసులతో దాడి చేయించిన జేసీని ఇక ఉపేక్షించకూడదన్నది ప్రబోధానందుడి కమిట్మెంట్. మొత్తానికి తాడిపత్రి తంటా భలే ఆసక్తికరంగా మారుతోంది.

Related News