ఏ బస్సెక్కుతావ్ రాజా..!

ప్రముఖ రచయిత, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళి.. పొలిటికల్ చౌరస్తాలో నిలబడ్డాడు. మరోసారి తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోవాలన్న ధ్యాసలో పడ్డారాయన. గతంలో ప్రజారాజ్యం తరఫున చిలకలూరిపేట సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడారు. ప్రస్తుత మంత్రి పత్తిపాటి పుల్లారావు గెలిచిన ఈ నియోజకవర్గంలో పోసానికి కేవలం 14 వేల నామమాత్రపు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆ తర్వాత విలీనానికి ముందే పీఆర్పీ నుంచి బైటికొచ్చేశారు. ఎవ్వరిని బడితే వాళ్ళను ఇష్టపూర్వకంగా విమర్శిస్తూ.. సినిమాల్లో కూడా బాగా బిజీగా మారిన పోసాని.. ఈ స్వేచ్ఛను మళ్ళీ వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

2019 ఎన్నికల్లో పోటీ చేసి.. అసెంబ్లీకెళ్ళి తన చిరకాల కోరికను తీర్చుకోవాలన్నది పోసాని ప్లాన్. తాజాగా కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్‌ని కలిసి ముచ్చటించారు. జగన్ కమిట్మెంట్ నన్ను ఆకట్టుకుంది అంటూ కాంప్లిమెంట్ ఇచ్చిన పోసాని కృష్ణమురళి.. త్వరలో పార్టీ కండువా కప్పుకుంటానన్న సిగ్నల్స్ ఇచ్చేశారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాల్లో తరచూ కనిపిస్తూ.. ఏపీలో అధికారపార్టీని తిట్టిపోసే పోసాని వెనుక ఎప్పట్నుంచో జగన్ ఉన్నారంటూ వార్తలున్నాయి. సినిమా ఫీల్డ్‌లో వైసీపీకి అనధికార అధికారప్రతినిధిగా చెలామణీ అయిన పోసాని.. రేపట్నుంచి.. రెగ్యులర్ డ్యూటీలో జాయిన్ అవుతారన్న మాట. ఈసారి కూడా చిలకలూరిపేట బస్సే ఎక్కుతారా..? రూటు మారుస్తారా అనేదే డౌట్!

Related News