‘సినిమా చూపిస్త మామా..’!

సిక్కోలును పీల్చి పిప్పిచేసి వదిలిపెట్టింది తిట్లి తుపాన్. దాదాపు వారం రోజులు గడుస్తున్నా.. అక్కడి పరిస్థితి కుదుటపడింది లేదు. రాష్ట్ర ప్రభుత్వంలోని సగం యంత్రాంగం ఇప్పుడక్కడే మకాం వేసి సహాయ పనుల్లో మునిగింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దగ్గరుండి ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తున్నారు. ఎంత చేసినా చేసినట్లు కనిపించడం అనేది ముఖ్యం కనుక.. తమ కష్టాన్ని ప్రచారం చేసుకునే డ్యూటీని అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా భుజానికెత్తుకుంది. ఈ దిశగా.. లోకల్ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడి దూకుడు ఎక్కువగా కనిపిస్తోంది.

అసలే యువకుడు.. ఆపై సక్సెస్‌ఫుల్ రాజకీయ నాయకుడు. ఎప్పటికప్పుడు టెక్నికల్‌గా అప్డేట్ అవుతూ.. సోషల్ మీడియాకివ్వాల్సిన ప్రయారిటీని గుర్తించి దూసుకుపోతున్న రామ్మోహన్.. స్థానిక జనాభాకు ఆవిధంగా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడొచ్చిన తిట్లి తుపాన్ రామ్మోహన్ నాయుడుకు ఒక పరీక్ష లాంటిది. తుపాను ప్రభావిత ప్రాంతం అంతా తన నియోజకవర్గం పరిధిలోనిదే కనుక.. దీన్నొక ‘అవకాశం’గా తీసుకుని కష్టపడుతున్నాడు. బాబాయ్ అచ్చంనాయుడుతో పాటు సీఎం చంద్ర బాబు, చినబాబు లోకేష్‌ల నుంచి కూడా రామ్మోహన్‌కి చేయూత దొరికింది.

సరిగ్గా ఎన్నికలకు ముందు ముంచుకొచ్చిన ఈ ఉపద్రవం నుంచి రామ్మోహన్ ఎంత మేర రాజకీయం పండించుకుంటారన్నది ఒక పార్శ్వమైతే.. ఇక్కడ ప్రచారమే తప్ప పనులు జరగడం లేదన్న వ్యతిరేకత మరో పార్శ్వ్యం. తిట్లి ఉత్థానం రిహాబిలిటేషన్ ప్రోగ్రాం పేరుతో ఒక ఫోరమ్ ఏర్పాటు చేసి.. రామ్మోహన్ నాయుడు శ్రమిస్తున్నప్పటికీ.. గ్రౌండ్ లెవెల్ దాకా ‘సహాయం’ అందడం లేదని క్షేత్రస్థాయి రిపోర్ట్స్ చెబుతున్నాయి. దాదాపు 30 వేల ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయిన క్రమంలో.. వీటన్నిటినీ పునరుద్ధరించడానికి ఎన్ని రోజులు పడుతుందన్న స్పష్టత ఇప్పటిదాకా లేదు. కునారిల్లిపోయిన పలాస జీడి పరిశ్రమ మళ్ళీ కోలుకోవాలంటే.. కనీసం విద్యుత్ వ్యవస్థనైనా పునరుద్ధరించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. జిల్లా అంతటా కరెంటిచ్చేశామని ముఖ్యమంత్రి చెబుతున్నారు.. చూడండి నేను చీకట్లోనే పలాస ప్రజల్ని పరామర్శిస్తున్నా.. అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఎన్‌కౌంటర్ షురూ చేశారు.

బియ్యం అందినా.. వాటితో కనీసం అన్నం వండుకునే సదుపాయం కూడా లేక కిరసనాయిల్ కోసం దేహీ అంటున్న మారుమూల గ్రామాలు వెయ్యికి పైగా ఉన్నట్లు చెబుతున్నారు. అధికారులు సీఎం చుట్టూ తిరగడానికే ప్రాధ్యాన్యతనిస్తున్నారని, అవసరం వున్న చోట వాళ్ళ సంచారమే లేదని లోకల్ మీడియా కోడై కూస్తోంది.

పొరుగు జిల్లాలోనే వున్న జగన్, పవన్ తుపాను పీడిత ప్రాంతాల మీద కనీస చిత్తశుద్ధి చూపడం లేదని చంద్రబాబు విమర్శిస్తే.. మీరు చేస్తున్న ఓవరాక్షన్ చాలదా అని అట్నుంచి కౌంటర్లు పడిపోతున్నాయి. ఈ విధంగా విమర్శలు-ప్రతివిమర్శలతో సోషల్ మీడియా వేదికగా.. ‘తిట్లి తుపాన్’ ఒక పొలిటికల్ సినిమానే తలపిస్తోంది.

Related News