కాంగ్రెస్ నేత ఏం చెబుతాడో ?

మిర్యాలగూడలో పెరుమాళ్ళ ప్రణయ్ హత్య కేసులో కాంగ్రెస్ నేత కరీం సహా అయిదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రణయ్ భార్య అమృత తండ్రి మారుతీ రావు, అతని తమ్ముడు శ్రావణ్ కుమార్, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడైన కరీంతో సహా మరో ఇద్దరిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న ప్రధాన నిందితుని కోసం గాలిస్తున్నామని వారు చెప్పారు. కరీంను విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.
ప్రణయ్ హత్యకు మారుతీ రావు ముందే ప్లాన్ చేసుకున్నాడు. ఓ మాజీ ఉగ్రవాది సహాయంతో బాటు మరో గ్యాంగ్ హెల్ప్ కూడా తీసుకున్నాడు. వారికి పెద్ద మొత్తంలో సుపారీ ఇచ్చాడు అని పోలీసులు తెలిపారు. అటు-తనకు ప్రాణాపాయం ఉందని గ్రహించిన ప్రణయ్..తన ఇంటి లోపల, బయట ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడని తెలిసింది. అయితే..ఇతని మర్డర్ కు సుపారీ తీసుకున్న గ్యాంగ్ సభ్యులు ఇతని కదలికలపై నిరంతరం నిఘా ఉంచారని చెబుతున్నారు.
 ప్రణయ్ శుక్రవారం తన భార్య అమృతను తీసుకుని మిర్యాలగూడలోని ఆసుపత్రికి వెళ్ళగానే ప్రధాన నిందితుడు టూ వీలర్ పై వారిని అనుసరించాడని, వెనుకనుంచి మాటు వేసి ప్రణయ్ పై కత్తితో దాడి చేశాడని, ఈ దృశ్యాలు దగ్గరలోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్దయ్యాయని పోలీసులు చెప్పారు. హత్య జరిగిన సమాచారాన్నిఅమృత తన తండ్రి మారుతీరావుకు  ఫోన్ లో చెప్పగానే  అతడు అద్దంకి రహదారివైపు కారులో పారిపోయిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమరా ఫుటేజీ ద్వారా తెలిసిందని వెల్లడించారు.
ఇదిలా ఉండగా..ఈ పరువు హత్య వీడియోను లక్షల మంది చూశారట. ‘ నీ పెళ్లి రిసెప్షన్  వీడియో కంటే ప్రణయ్‌ని హత్య చేసిన వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయని’ మారుతీరావు సుమారు మూడు వారాలక్రితమే తన కూతురితో చెప్పిన మాటలు నిజమయ్యాయని అంటున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న తన కుమార్తె పట్ల ఒక తండ్రి కుల దురహంకారంతో ఇంత దారుణానికి ఒడిగడతాడా ? ఆ అభాగ్యురాలి భవితవ్యం ఏమిటి అన్న ప్రశ్నలు మానవతావాదులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Related News