”చంద్రబాబుగారు.. నాకూ వెన్నుపోటు పొడిచారు..”

”ఆయన ముందు నవ్వుతారు.. వెనకనుంచి పొడుస్తారు.. నేను అర్థం చేసుకోగలను” అంటూ సీఎం చంద్రబాబునుద్దేశించి సీరియస్ కామెంట్స్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తన టూర్ సక్సెస్ కాకూడదన్న దురుద్దేశంతో.. పోలీసుల్ని, రెవెన్యూ అధికారుల్ని కట్టడి చేశారు.. వాళ్ళ చేతులు కట్టేశారు.. వాళ్ళ పని వాళ్ళు చెయ్యనివ్వడం లేదు… అంటూ బాబు సర్కారుని సూటిగా దుయ్యబట్టారు పవన్. ఉద్దానం కిడ్నీ బాధితుల పక్షాన సిక్కోలులో చేపట్టిన 24 గంటల దీక్షను విరమించారు పవన్ కళ్యాణ్.

ఆ సందర్భంగా మాట్లాడుతూ.. తన నిరశన దీక్షను పెద్ద ఎత్తున నిర్వహించాలనుకున్నామని, కానీ ప్రభుత్వ చర్యల పట్ల అనుమానంతో కుదించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ”డబ్బుల్లేవంటే కుదరదు బాబు గారూ..! అభాగ్యులకు, అనారోగ్య పీడితులకు లేని డబ్బులు మీ ఆడంబరాలకు ఎలా దొరుకుతున్నాయి. 2 వేల కోట్లు పెట్టి పుష్కరాలు ఎలా నిర్వహించారు.. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలనుకుంటే.. అనేక మార్గాల నుంచి డబ్బు తీసుకురావొచ్చని మీకు తెలీదా”? అని ప్రశ్నించారు.

”మీరు మంచి పాలన ఇస్తారని ఆశించాను.. కానీ మీరు నిర్మాణాత్మక పరిపాలన ఇవ్వడం లేదు. మీకు మద్దతిచ్చిన నన్ను మోసగించారు” అనేశారు. ఉద్దానం బాధితులకు రెండున్నర వేలిస్తున్నారు.. కానీ.. చాలదు.. మండలానికో డయాలసిస్ సెంటర్ పెట్టండి. రోగుల కోసం బస్సు ఏర్పాటు చేయండి అంటూ ఉద్దానం బాధితుల కోసం మరికొన్ని డిమాండ్లు ముందుకు తెచ్చారు. తన పోరాటం రాజకీయ లబ్ది కోసం కాదని.. తాను సామాజిక రాజకీయ చైతన్యం కోసం రాజకీయాల్లోకొచ్చిన వాడ్నని.. చెప్పారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన యాత్ర, జనసైనికుల కవాతు యధావిధిగా కొనసాగుతాయన్నారు.

Related News