ఏపీలోనూ ‘మహాకూటమి’!

తెలంగాణలో తెరాసకు పోటీగా చిన్నాపెద్దా పార్టీలన్నీ ఒక్క తాటిమీదకొచ్చి ‘మహా కూటమి’ ప్రయోగంపై కసరత్తు చేస్తున్నాయి. నాలుగైదు వారాల్లో ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఈ మహా స్ట్రాటజీ వేగం పుంజుకుంది. ఇదిలా ఉంటే.. ఇదే గ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అటువంటి ఎక్స్‌పరిమెంటే వర్కవుట్ అవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం, వైసీపీల మధ్య సమఉజ్జీ పోరు నడుస్తోంది. మూడో ప్రత్యామ్నాయంగా నిలబడే సత్తా మరో పార్టీకి లేదు కనుక.. ఇక్కడ కూడా ‘మహా కూటమి’ వ్యూహాన్ని అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆలోచన మొట్టమొదటిగా మొగ్గతొడిగింది కమ్యూనిస్టు పార్టీల దగ్గరే!

శనివారం విజయవాడలో జరిగిన వామపక్షాల మహా గర్జన.. ఏపీలో ఐక్య కూటమి ప్రతిపాదనకు వేదికైంది. ఊహించినంత స్థాయిలో ప్రజలు తరలిరావడంతో ఏపీలో వేళ్లూనుకోవాలన్న సంకల్పం కామ్రేడ్లలో బలపడింది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ పాల్గొన్న ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ‘ఐక్య కూటమి’పై క్లారిటీనిచ్చారు. వామపక్షాలు, జనసేన, బీఎస్పీ, లోక్‌సత్తా, ఆమ్‌ఆద్మీ పార్టీలతో ఐక్య కూటమి ఏర్పాటు చేయాలన్న తన వ్యూహాన్ని ఆయన జనం ముందు వెల్లడించారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న టీడీపీకి, దోచుకోవాలనుకుంటున్న వైసీపీకి ఈసారి అధికారం కట్టబెట్టవద్దని, అభ్యుదయ భావాలున్న పార్టీల్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఇప్పటికే.. జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్‌తో అనేక దఫాలుగా చర్చలు జరిపారు ఉభయ కమ్యూనిస్టు నేతలు.

Related News