‘పెదరాయుడు’గా పవర్‌స్టార్!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అట్నుంచి నరుక్కొస్తున్నారా? హద్దు మీరుతున్న ప్రజాప్రతినిధుల మీద పరోక్ష వత్తిడి పెంచి.. అధికార పార్టీని ఇరుకున పెట్టాలన్న స్ట్రాటజీని అమలు చేసుకుంటున్నారా? ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో టూరేసిన పవన్.. తాజా వ్యూహాన్ని అక్కడ్నించే షురూ చేసినట్లు తెలుస్తోంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలతో ప్రెస్‌నోట్ రిలీజ్ చేయించారు. చింతమనేని రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని, ఆ ఎమ్మెల్యే తీరు రౌడీషీటర్ ను తలపిస్తోందని, చింతమనేనిని సీఎం అదుపు చేయకపోతే ఆ పని ప్రజలే చేస్తారని పేర్కొంటూ సాగింది సదరు ప్రెస్ నోట్.

మిగతావాళ్ళతో పోలిస్తే కాసింత నోరు, చెయ్యి ఎక్కువగా వాడే నాయకుడిగా చింతమనేనికి ఎప్పట్నుంచో పేరుంది. ఈ తరహా నైజంతో ఆయన అనేకమార్లు వివాదాల్లో చిక్కుకుని, అధిష్టానానికి తలనొప్పులు తెప్పించారు కూడా. ఎమ్మార్వో వనజాక్షితో జరిగిన గొడవ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ నేత వట్టి వసంత్ కుమార్ మీద చేయి చేసుకున్న వ్యవహారం ఆయన్ను ‘జైలు శిక్ష’ దాకా తీసుకెళ్లింది. మంత్రి పదవి దక్కని సమయంలో నేరుగా పార్టీ అధిష్టానం మీదే ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారాయన. ఇదే క్రమంలో.. తాజాగా తన మాట వినలేదన్న కారణంతో ఏలూరు లిక్కర్ డిపోలో ఒక కార్మికుడిని కులం పేరుతో దూషించి, దాడి చేసినట్లు వార్తలొచ్చాయి.

మంగళవారం ఏలూరులోని క్రాంతి కల్యాణ మండపంలో ఆలిండియా దళిత హక్కుల నేతలు, హమాలీలతో సమావేశమైనప్పుడు ‘చింతమనేని’ బాధితుడు పవన్ కళ్యాణ్‌ని కలిసి తనపై జరిగిన దాడి గురించి ‘ఫిర్యాదు’ చేశాడు. 37 కేసుల్లో ముద్దాయిగా ఉన్న చింతమనేనిపై ఇది 38వ కేసని చెప్పిన పవన్.. ప్రభుత్వ మెకానిజాన్ని అదుపులో పెట్టుకుని ఎమ్మెల్యే పెట్రేగి పోతున్నారని, చంద్రబాబు అదుపులో పెట్టకపోతే  ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విశాఖ జిల్లాలో ఇటీవల హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి విషయంలో కూడా తాను ముందే హెచ్చరించానంటూ సన్నిహితులతో చెప్పారు పవన్ కళ్యాణ్. సో.. పవన్ ‘పెదరాయుడి’ అవతారమెత్తి పంచాయతీ చెప్పడం షురూ చేస్తున్నట్టేనా?

Related News