‘ఆత్మీయ సదస్సులో ఆత్మహత్య ప్రస్తావనలా..?’

సినిమా ఇండస్ట్రీ మీద, సినిమాల్లో స్టార్‌డమ్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తనకు తెలీకుండానే కొన్ని రిమార్కబుల్ కామెంట్స్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన చిరంజీవి అభిమానుల ఆత్మీయ సదస్సులో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా ప్రసంగించారు. తనకు, అన్నయ్య చిరంజీవికి మధ్యనుండే భావజాల వైరుధ్యాల్ని వివరించడానికి, తామిద్దరికీ మధ్య ఎమోషనల్ గ్యాప్ ఉందన్న అనుమానాల్ని తెగ్గొట్టడానికి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నించారు. చిన్నప్పటినుంచీ అన్నయ్యతో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఆయన తన కోసం ఎంతెంత చేశారో చెప్పుకున్నారు. ఆయన మీద తనకెందుకు అంత గౌరవం కలిగిందో వివరించారు.

”సినిమా కెరీర్లో అన్నయ్యకు ఎదురైన చేదు, తీపి అనుభవాల్ని దగ్గరగా చూసినవాళ్లలో నేనూ ఒకడ్ని. ఒక సినిమా జయాపజయాల్ని ఎలా తీసుకోవాలనే విషయంలో ఆయనకు స్పష్టత వుంది. కానీ.. నేను మాత్రం ఆ బ్యాలెన్స్ పాటించలేకపోయేవాడ్ని. ఒక సినిమాలో టెక్నీషియన్ తప్పు చేసినా, డైరెక్షన్ బాగా లేకపోయినా, చివరకు షూటింగ్ ఆగిపోయినా హీరో మీదనే తోసేస్తారు. ఆడితే అందలమెక్కించడం, ఆడకపోతే కిందికి తోసెయ్యడం.. అన్నీ హీరో ఒక్కడే పడాలి.. ఈ పధ్ధతి నాకెందుకో నచ్చేది కాదు. అందుకే.. ఆ నిస్తేజంతోనే నేను ఆడియో ఫంక్షన్స్‌లో సరిగా మాట్లాడేవాడ్ని కాదు.. దూరంగా తల వొంచుకుని నిలబడడానికి అదే కారణం” అంటూ తన నైజాన్ని విడమర్చి చెప్పారాయన.

ఇదే సమయంలో ఒక షాకింగ్ పాయింట్‌ని కూడా రీకాల్ చేసుకుని అభిమానుల మనసు చివుక్కుమనేలా చేశారు. సినిమాలో సక్సెస్ లేని రోజుల్లో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించింది.. అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉలిక్కిపడింది. వెంటనే తేరుకుని.. నటుడిగా ఎప్పటికీ సక్సెస్ కాలేనేమోనన్న ఆందోళన నన్ను అలాంటి ఆవేదనకు గురి చేసింది.. అన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి భారీ సైజు టార్గెట్లు ఫిక్స్ చేసుకుంటున్న తమ ఆరాధ్య నాయకుడు.. మునుపటిలా కాకుండా మంచి మనోనిబ్బరంతో వుండగలడని ఫ్యాన్స్ ధీమాతో వున్నారు.

Related News