ఉద్దానం కోసం పస్తులు.. పవన్ కళ్యాణ్ అజ్ఞాత దీక్ష!

ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా.. అన్నది గబ్బర్‌సింగ్ వేషంలో పవన్‌కళ్యాణ్ వేసిన ఘనమైన పంచ్ డైలాగ్! జనసేన అధ్యక్షుడిగా కూడా ఆయన అదే చేస్తున్నారు. ఎవరో సెట్ చేసిన ట్రెండ్ ఫాలో కాకుండా.. తనకు తానే కొత్త ట్రెండ్ సెట్ చేసుకోవడంలో పవన్ మరో ముందడుగేశారు. రాజకీయ నాయకులు చేపట్టే దీక్షలకు సంబంధించి.. పవన్ స్టైల్ అంటూ ఒకటి క్రియేటైపోవడం ఖాయం. వివరాల్లోకెళితే.. ఉత్థానం కిడ్నీ బాధితుల కోసం చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని.. 48 గంటల్లోగా స్పష్టమైన ప్రకటన విడుదల చేసి బాధితులకు భరోసా ఇవ్వకపొతే.. నిరాహారదీక్ష చేస్తానని పలాసలో హెచ్చరిక జారీ చేశారు పవన్ కళ్యాణ్. వెంటనే ట్విట్టర్లో స్పందించిన లోకేష్.. పవన్‌కి వివరణ ఇచ్చారు. అటు.. విశాఖ ధర్మపోరాట సభలో సీఎం చంద్రబాబు సైతం.. కిడ్నీ బాధితుల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని ఏకరువు పెట్టారు. కానీ.. సీఎం చెబుతున్నదానికీ క్షేత్ర స్థాయిలో బాధితులకు ఒరుగుతున్నదానికి పొంతన లేదంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దీక్షకు పూనుకున్నారు. తమ అధినేత 24 గంటల దీక్ష చేయనున్నారంటూ జనసేన నుంచి ప్రకటన వెలువడింది. శుక్రవారం సాయంత్రం 5 నుంచి ఘనాహారం తీసుకోకుండా.. మరుసటి రోజు ఉదయం 9 నుంచి శ్రీకాకుళం జనం సమక్షంలో దీక్షకు కూర్చుంటారని ఆ ప్రెస్ రిలీజ్ చెబుతోంది. శనివారం సాయంత్రం 5 గంటలకు పవన్ దీక్ష విరమిస్తారట! మొత్తం 24 గంటల్లో 16 గంటల పాటు అజ్ఞాతంలో ఉండి చేసే పవన్ దీక్ష నిజంగానే ట్రెండ్ సెట్టర్ దీక్షేనంటూ కాంప్లిమెంట్లు పడిపోతున్నాయి.

Related News