రూ.101 కోట్లు నమిలేశారు!

కదన రంగంలో తప్ప.. మరెక్కడా కలవరనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. ఎట్టకేలకు చేతులు కలిపి.. పరస్పరం మాట్లాడుకుని.. ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశారు. భేటీ సారాంశం ఏమిటన్నది అటుంచితే.. సదరు భేటీకి సంబంధించిన సైడ్ లైన్స్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తున్నాయి.


  • శాంతి చర్చల కోసం జరిగిన వీరిద్దరి భేటీపై దక్షిణకొరియా ప్రశంసల జల్లు కురిపించింది. నార్త్ కొరియాతో ఘర్షణ వైఖరి అవలంబించే దక్షిణ కొరియా ఈ భేటీ విషయంలో సానుకూలత ప్రదర్శించింది. వీళ్లిద్దరి భేటీని ‘టాక్ ఆఫ్ ది సెంచరీ, టాక్ ఆఫ్ ది హిస్టరీ’ అంటూ ఆకాశానికెత్తేసింది. శాంతి స్థాపనకు ఇదొక కొత్త అధ్యయమని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ వ్యాఖ్యానించారు.

 

  • డొనాల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్ ల భేటీ మహా అయితే.. 38 నిమిషాల పాటు సాగి ఉంటుంది. ఐతే.. ఇందుకోసం సింగపూర్ ప్రభుత్వం అక్షరాలా కోటి 50 లక్షల డాలర్లు అంటే సుమారు రూ.101 కోట్లు తగలేసింది. మొత్తం కొరియా ప్రతినిధుల ఖర్చులన్నీ తామే భరిస్తామని హామీ ఇచ్చిన సింగపూర్ ప్రభుత్వం ఈ మేరకు సొంత చమురు వదిలించుకుంది.

 

  • ట్రంప్, కిమ్ ల సమావేశం సందర్భంగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ఎక్కడికెళ్ళినా ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తారు. విమానం దిగితే ‘ద బీస్ట్’ అనే ఒక అధునాతనమైన కారులోనే ఎక్కుతారు. కిమ్ కి ఈ కారును చూపెడుతూ.. దాని ప్రత్యేకతల్ని వివరించి చెప్పారు ట్రంప్. ఒక్కసారి ‘ద బీస్ట్’ కారెక్కి ఆ ‘ఫీల్’ని కూడా ఎంజాయ్ చేశాడు నార్త్ కొరియన్ సూపర్ స్టార్.

 

  • ఈ చారిత్రక భేటీకి వేదిక కల్పించిన సింగపూర్ ఎక్కడ అంటూ అమెరికన్లు గూగుల్‌లో విపరీతంగా వెతికేశారు. సింగపూర్లో ట్రంప్ – కిమ్‌ల భేటీ జరిగిన కేపెల్లా హోటల్ గురించి.. దాని ప్రత్యేకతల గురించి అదేపనిగా సెర్చ్ చేసి.. చర్చించుకున్నారు. దీంతో.. సింగపూర్ కేపెల్లా హోటల్ ‘నెట్టింట’ విపరీతంగా వైరల్ అయ్యింది.

Related News