కన్నడ సర్కారులో దేవెగౌడ పాత్ర.. కుమారస్వామి క్లారిటీ!

హరదన హళ్లి దేవెగౌడ కుమారస్వామి.. అలియాస్ కుమారన్న.. కన్నడ గద్దె మీద రెండోసారి సిట్టింగేశారు. చిత్ర విచిత్రమైన పరిస్థితుల మధ్య పవర్లోకొచ్చిన కుమారస్వామి.. కన్నడ రాజ్యాన్ని పూర్తి ఐదేళ్లూ ఏలిపారేస్తా చూడండి అంటూ ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. ‘రాజకీయాల్లో జేడీఎస్ రాజకీయం వేరయా’ అని అక్కడివాళ్లు చెప్పుకున్నట్లే.. జేడీఎస్ సుప్రీమ్ కుమారస్వామి తనదైన రాజకీయాన్ని రుచిచూపించినా చూపిస్తారు. రేపట్నుంచి.. ఎత్తులు-పైఎత్తులతో రసవత్తరంగా సాగబోయే కన్నడ పొలిటికల్ డ్రామా కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే.. ఎడ్యూరప్ప ప్లస్ అమిత్‌షా.. ఈ కమర్షియల్ కాంబో జిత్తుల్ని కుమారస్వామి ఒంటరిగానే ఎదుర్కోలేరని.. తనకు రాజకీయాల్లో ఓనమాలు దిద్దించిన తండ్రి దేవెగౌడ సూపర్ సీఎంగా వ్యవహరిస్తూ.. పైపెత్తనం చెలాయిస్తారని అక్కడి మీడియా రాస్తోంది. యూపీఏ చైర్‌పర్సన్ హోదాలో సోనియా వెనకుండి మన్మోహన్‌ని నడిపించినట్లే.. దేవెగౌడ కూడా కన్నడ ప్రభుత్వాన్ని, కన్నడ రాజకీయాన్ని నడిపిస్తారని కథనాలొస్తున్నాయి.

ఇదే విషయాన్ని కుమారస్వామి దగ్గర ప్రస్తావిస్తే.. ‘మా నాన్నకు అంత సీనిచ్చే ప్రసక్తే లేదు’ అంటూ తేల్చిపారేశారు. ఒక జాతీయ మీడియా సంస్థకిచ్చిన మొట్టమొదటి ఇంటర్వ్యూలో కుమారస్వామి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం కుర్చీ మీద సర్వ హక్కులూ నావే. నేను ప్రజల్లో తిరిగిన వాడ్ని, ప్రజా ముఖ్యమంత్రిని. నాకు ఎవ్వరి ప్రోద్బలమూ అవసరం లేదు’ అని ఖరాఖండిగా చెప్పేశారు. ఒక పెద్దమనిషిగా ఆయనిచ్చిన సలహాల్ని పరిశీలిస్తాను తప్ప.. పూర్తిగా ఆయన పెత్తనమే నడిచే ప్రసక్తే లేద’న్నారు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయకముందే.. చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో స్పెషల్ మీటింగ్ పెట్టేశారు మాజీ ప్రధాని దేవెగౌడ. ఈ అంశంపై మూడురోజులుగా అనేక రకాల విమర్శలొచ్చాయి. ఏదేమైనా.. ఈ తండ్రీకొడుకుల మధ్య ముందటినుంచే మనస్పర్థలున్న మాటైతే వాస్తవం. ఇటు ఇంటిపోరు.. అటు పక్కలో బల్లెం లాంటి కాంగ్రెస్ పోరు.. ఎదురుగా బలమైన ప్రతిపక్ష బీజేపీ జోరు.. ఇన్ని ప్రతికూలతల మధ్య ‘సంకీర్ణ’ బండిని ఎన్నాళ్ళు ఎలా లాక్కొస్తారో చూడాలి కుమారన్న!

Related News