ఇకపై.. ‘మా’మంతా ఒకటే..!

ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా మేమంతా ఒకటేనంటున్నారు.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గం. జూబ్లీ ఈవెంట్స్ నిధుల గోల్‌మాల్‌కి సంబంధించి మొన్నీమధ్యే రచ్చకెక్కిన మా అధ్యక్ష, కార్యదర్శులు శివాజీరాజా, నరేష్‌ మళ్ళీ మీడియా ముందుకొచ్చారు. దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వీళ్ళ పంచాయతీలో పెద్దరికం వహించారు. ‘మా’లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అన్నీ ఒప్పందం ప్రకారమే జరిగాయని.. గతాన్ని పక్కకుపెట్టి.. ఇకపై అందరూ కలిసి పని చేస్తారని చెప్పారు భరద్వాజ. భవిష్యత్‌లో సినిమా ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ‘కలెక్టివ్‌ కమిటీ’ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ‘మా’లో సఖ్యత కోసం మీడియా కూడా సహకరించాలని కోరారు.

‘‘మా’కు సంబంధించిన ఫండ్స్ విషయంలో చెలరేగిన వివాదాలు కూడా సర్దుకున్నాయి. లెక్కంతా పక్కాగా వుంది’’ అన్నారు ప్రొడ్యూసర్ సురేష్‌బాబు. ”అన్నీ మర్చిపోదాం.. ఇప్పుడు సిల్వర్ జూబ్లీని విజయవంతం చేయడమే మా కర్తవ్యం” అంటూ చేతులో చెయ్యేసి ఒక్కటయ్యారు ‘మా’ జనరల్‌ సెక్రటరీ నరేష్‌, అధ్యక్షుడు శివాజీరాజా. సో.. టీ కప్పులో ‘మా’ తుపాను ముగిసినట్లే!

Related News