కుతుబ్ మినార్‌లా ఈ లిస్టేంటి?: నారా లోకేష్

ఇటీవల కాలంలో ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో సెటైర్లు కురిపిస్తున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. తాజాగా మోదీకి కన్నా అందజేసిన లేఖపై ఆయన సెటైర్లు వేశారు. 90 శాతం హామీలు నెరవేర్చామంటారు.. మరి మోదీకి బీజేపీ ఇచ్చిన ఈ కోరికల లిస్టేమిటంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీతో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిన్న భేటీ అయిన సందర్భంలో ఓ వినతి పత్రం కూడా సమర్పించారు. ఆ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన లోకేష్.. ‘ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ బీజేపీ అందజేసిన లేఖ ఇది. ఆశ్చర్యమేస్తోంది…

ఏపీకి 90 శాతం హామీలు నెరవేర్చామని బీజేపీ చెప్పుకోవడం నిజమయితే, మరిప్పుడు కుతుబ్ మినార్ అంత పొడవున్న ఈ కోరికల చిట్టా ఏంటి? ఈ జాబితాలో ప్రత్యేకహోదా గురించి లేదే.. తప్పుడు ప్రచారాలను ఆపి, ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు. ఇదిలాఉంటే, కన్నా-మోదీ భేటీలో ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడం, బీజేపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురు దాడి, ఇతర పార్టీల కార్యాచరణ తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.

Related News